రాబోయే 8 రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి పండగలు నిర్వహించడానికి అనుమతి లేదని హైదరాబాద్ ఈస్ట్
డీసీపీ రవీందర్
సిటీబ్యూరో: రాబోయే 8 రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి పండగలు నిర్వహించడానికి అనుమతి లేదని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రవీందర్ స్పష్టం చేశారు. వర్సిటీలో ఈనెల 10న ‘బీఫ్ ఫెస్టివల్, ‘గో పూజ’, 12న ‘పోర్క్ ఫెస్టివల్’ పేరుతో వేడుకలను నిర్వహిస్తామని పలు సంఘాలు, సంస్థలు ప్రకటించిన విషయం తె లిసిందే. వీటి నిర్వహ ణపై అన్ని వైపుల నుంచి భిన్న స్వరాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వర్సిటీలో పండగల నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని వర్సిటీ వర్గాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. క్యాంపస్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని డీసీపీ రవీందర్ చెప్పారు. ఇందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పండగలు కాదు.. సమస్యలపై దృష్టి సారించాలి
ఓయూలోని సమస్యల పరిష్కారంపై అందరూ దృష్టిసారించాలని, పండగల పేరుతో వర్సిటీలోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ పిలుపునిచ్చారు. వర్సిటీలో విద్యకు సంబంధించి, అందరికీ ఆమోదయోగ్యమైన పండగలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఓయూలో పేరుకపోయిన మెస్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, వర్సిటీ అభివృద్ధికి రూ. 100 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నేడు రౌండ్‌టేబుల్ సమావేశం
పెద్దకూర పండగపై రాద్దాంతం చేయడంతోపాటు.. దాన్ని అడ్డుకునేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా కుట్ర పనుతున్నారని ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ప్రతినిధులు ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఫిర్యాదు చేశామని, ఈ కేసును హెచ్‌ఆర్‌సీ స్వీకరించిందని చెప్పారు. ఈనెల 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసిందని వివరించారు. బీఫ్ ఫెస్టివల్‌పై ఓయూలో శనివారం రాజకీయ, ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. పెద్దకూర తిన్నారన్న కారణంగా దేశవ్యాప్తంగా దాడులకు గురైన బాధిత కుటుంబాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామన్నారు.