మేకిన్ ఇండియా ఆసరాగా టోకరా
వెబ్‌సైట్ ఏర్పాటు చేసి మోసం
నిండా మునిగిన రెండు సిటీ కంపెనీలు
సిటీబ్యూరో: నానాటికీ తెలివి మీరుతున్న సైబర్ నేరగాళ్లు ఏ ‘సీజన్లో’ ఆ తరహా ఫ్రాడ్‌ను ఎంచుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా ప్రొగ్రామ్‌ను ఆసరాగా చేసుకుని సిటీకి చెందిన రెండు కంపెనీలను మోసం చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ సైబర్ నేరగాళ్లు దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేకిన్ ఇండియాను ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు ‘సర్వీసెస్’ పేరుతో ఓ వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. దీని హోమ్ పేజ్‌లో దేశంలోని రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించినట్లు చూపించారు. ప్రతి జోన్‌లోనూ వివిధ రకాలైన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఆసక్తి గల కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చనీ ఎర వేశారు. దీనికి స్పందించిన పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రస్తుతం తాము చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి విలువల్నీ చూపిస్తూ ఈ-మెయిల్స్ చేశాయి. వీటికి సమాధానం ఇచ్చిన సైబర్ నేరగాళ్లు తాము సూచించిన ప్రాజెక్టుల విలువలో ఒక శాతం ఈఎండీ (ఎర్న్ మనీ డిపాజిట్) చెల్లించాలని, టెండర్ ప్రక్రియలో పాల్గొన్న తర్వాత ప్రాజెక్టు రాకుంటే ఈఎండీ తిరిగి ఇచ్చేస్తామంటూ ఎర వేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయంటూ ఈ-మెయిల్ చేశారు.
దీంతో అనేక కంపెనీలు సైబర్ నేరగాళ్లు సూచించినట్లే ఈఎండీలు చెల్లించారు. అయితే ‘సర్వీసెస్’ సంస్థ చెప్పినట్లు టెండర్లు ఓపెన్ చేసే తేదీ నాడు వీరెవరికీ ఎలాంటి ఈ-మెయిల్ సమాచారం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయా కంపెనీలు ఆరా తీయగా.. అసలు మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో నగరానికి చెందిన రెండు కంపెనీలు తమను గుర్తుతెలియని వ్యక్తులు తమను మోసం చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ సాంకేతిక ఆధారాలను బట్టి ఉత్తరాది కేంద్రంగా ఈ నేరం జరిగినట్లు నిర్థారించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ప్రియాంకరావు, తరుణ్‌గుప్తా ఆగ్రాలో కార్యాలయం ప్రారంభించారని, వీరికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తీ సహకరించాడని ప్రాథమికంగా గుర్తించారు. సిటీకి చెందిన రెండు కంపెనీలు రూ.13 లక్షల మేర మోసపోగా.. దేశవ్యాప్తంగా రూ.కోట్లలో స్కామ్ జరిగి ఉంటుదని భావిస్తూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.