అవునా...రాజీనామాలిచ్చేశారా?
అటు ఏపీసీసీ, ఇటు టీపీసీసీ అధ్యక్షులు తమ తమ పార్టీ పదవులకు రాజీనామాలిచ్చారనే వార్త కాంగ్రెస్‌పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ నాయకత్వానికి వారు రాజీనామాలు సమర్పించేశారని ఇక వాటిని ఆమోదించడమే తరువాయి అన్న చర్చ కూడా సాగుతోందట. యువరాజు రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామాలు చేయడంలో భాగంగానే ఇది కూడా చోటుచేసుకుందనే అసలు విషయాన్ని పార్టీ ముఖ్యనేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారట.
ఈ విధంగా ముందుగా తమ రాజభక్తిని, లాయల్టీని చాటుకుని, ఆ తర్వాత కూడా తమ పదవులను కాపాడుకునేందుకే ఈ ఎత్తువేశారని పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు రాగానే తాము కొనసాగించాల్సిన పీసీసీ అధ్యక్షుల రాజీనామాలను తిరస్కరించి, తాము మార్చదలుచుకున్న వారి రాజీనామాలను ఆమోదించడానికి కూడా దీనిని నాయకత్వ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని సీనియర్స్ సెలవిస్తున్నారట. ఏపీసీసీ, టీపీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేసినంత మాత్రాన ఇంకా వాటిని ఆమోదించనందున వారు పదవుల్లో ఉన్నట్లేనని చెబుతున్నారట. వారు రాజీనామాలు చేసినంత మాత్రాన ఆయా రాష్ట్ర కమిటీలు రద్దయినట్లు కాదని, అందువల్ల కార్యవర్గంలోని నాయకులు అనవసర భయాలు పెట్టుకోవద్దని భరోసానిస్తున్నారట. అయితే ఇవంతా ఉత్తుత్తి రాజీనామాలేనా అని ఈ నేతల వ్యతిరేక వర్గాల నాయకులు పెదవి విరుస్తుండడం కొసమెరుపు...