![అవాంతరాలున్నా మెట్రో పనులు ఆపలేదు: గాడ్గిల్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81410946726_625x300.jpg.webp?itok=K_mkt-pX)
అవాంతరాలున్నా మెట్రో పనులు ఆపలేదు: గాడ్గిల్
మెట్రోరైలు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రోరైల్ సీఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. తాజాగా హైదరాబాద్ మెట్రోరైలు విషయమై చెలరేగిన వివాదం నేపథ్యంలో ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాజెక్టుకైనా అవాంతరాలు ఉంటాయని, వాటిని పరిష్కరించుకోడానికి కొన్ని వందల, వేల లేఖలు రాస్తుంటామని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని ఈనెల పదోతేదీన ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమేనని గాడ్గిల్ చెప్పారు. అయితే, దాన్ని యథాతథంగా తీసుకుని కథనాలు రాయడం వల్ల ఇబ్బంది అవుతుందన్నారు.
తాము ఫిబ్రవరి నుంచే ప్రభుత్వానికి తమ సమస్యలపై లేఖలు రాస్తున్నామని గాడ్గిల్ చెప్పారు. అయితే ఇంతవరకు ఎక్కడా పనులు మాత్రం ఆపలేదన్నారు.ఇక మెట్రో మార్గంలో మార్పులపై ఇంతవరకు తమకు సమాచారం లేదని ఆయన అన్నారు. నిర్మాణ ప్రక్రియలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. సెప్టెంబర్ పదోతేదీన తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవమేనని ఆయన అన్నారు. తెలంగణ ప్రభుత్వం సహకారంతోనే ప్రాజెక్టు నడుస్తోందని, చిన్న ప్రాజెక్టుల విషయంలోనే చాలా ఉత్తరాలు రాస్తామని.. అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టులో కొన్ని వందల, వేల ఉత్తరాలు పరస్పరం రాసుకుంటామని ఆయన తెలిపారు. సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ఎలాగోలా పరిష్కరించుకుని, ముందుకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమని, అయితే ఇలాంటి కథనాలు రాయడం వల్ల స్ఫూర్తి దెబ్బతింటుందని గాడ్గిల్ చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఉన్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోను చర్చించామన్నారు.