
కేంద్ర నిర్ణయాలతో కార్మికులకు మేలు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వ్యవసాయేతర , నైపుణ్యం లేని, ‘సీ కేటగిరి’ ప్రాంతాల్లోని కార్మికుల దినసరి వేతనాన్ని రూ. 246 నుంచి రూ.350కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్ణయం తీసుకున్న కేంద్రానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
కాంట్రాక్ట్ వర్కర్లు, సరఫరా సంస్థల రిజిస్ట్రేషన్లు తప్పనిసరి చేయ డం కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికులకు కనీస పింఛను రూ. వెయ్యికి పెంచడం ఆహ్వానించదగినదని, 11 లక్షల సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక గుర్తింపు పత్రాలు ఇవ్వడం వారికి మేలు చేసే నిర్ణయమన్నారు. ఇందుకు చొరవ తీసుకున్న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, బండారు దత్తాత్రేయకు ధన్యవాదాలు తెలిపారు.