
నువ్వు లేచి.. నేను లేచి..!
మంత్రి హరీశ్‌రావుకు ప్రతిపక్ష నేత జానా క్లాస్
- కౌంటర్లు వేసుకుంటే సమయం వృథా అవుతుంది
- సభ్యులు మాట్లాడిన తర్వాతే మంత్రి వివరణ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల్లో విలక్షణంగా వ్యవహరించే ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి బుధవారం మంత్రి హరీశ్‌రావుకు క్లాస్ తీసుకున్నారు. అందరూ మాట్లాడిన తర్వాతే మంత్రులు మాట్లాడాలని, ఇది గతం నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని హితవు పలి కారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగానే.. హరీశ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సంద ర్భంగా కోమటిరెడ్డి, సంపత్ పేర్లను ప్రస్తావించారు. హరీశ్ వివరణ అనంతరం ఉత్తమ్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ఐఐఎం సభ్యుడు మొజాంఖాన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు.
ఈ సమయంలో మంత్రి తమ పేర్లు ప్రస్తావించినందున తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, సంపత్ కోరారు. అందుకు ఆమె అంగీకరించకపోవ డంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమ యంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన జానా తనదైన శైలిలో మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అంశాలన్నింటినీ నోట్ చేసుకుని, ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంపైనే మంత్రులు వివరణ ఇవ్వాలని, అప్పుడు ప్రభుత్వం చెప్పిన విషయాలు సరైనవా? ప్రతిపక్షాలు చెప్పినవి సరైనవా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిం చుకుంటారని చెప్పారు. ‘‘మంత్రులు మధ్యలో జోక్యం చేసుకోవద్దు. హరీశ్ కాంగ్రెస్‌నుద్దేశించి మాట్లాడిన మాటలకు నాకు కూడా కౌంటర్ ఇవ్వాలని ఉంది. నువ్వు లేచి నేను లేచి.. నువ్వు కౌంటర్ ఇచ్చి.. నేను కౌంటర్ ఇచ్చి.. ఇలా దానికే సమయం సరిపోతుంది. అంతా అయిపోయిన తర్వాతే మంత్రులు మాట్లాడాలి. ఇది గతం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం’’ అని క్లాస్ తీసుకున్నారు.
రైతులను విస్మరించిన ప్రభుత్వం
వ్యవసాయ పరిస్థితిపై చర్చ జరుగుతున్న సం దర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయంపై చేసిన కృషిని వివరించారు. రైతులకు ఇచ్చిన హామీలను మోదీ పూర్తిగా విస్మరించారని ఆరోపిం చారు. స్పందించిన కిషన్‌రెడ్డి తాను మాట్లాడుతున్న సమయంలో సింహ భాగం కేంద్రం తీసుకుంటున్న చర్యలు గురించే వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రూ.790 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ రాలేదని, వేపపూత పూసిన ఎరువులను సరఫరా చేయడం ద్వారా బ్లాక్‌మార్కెటింగ్‌ను మోదీ ప్రభుత్వం అరికట్టిందని చెప్పారు.
పెద్దాయన ఇబ్బంది
సభలో జానారెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ అటువైపు దృష్టి సారించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెనుక నుంచి ‘పెద్దాయన అడుగుతున్నారు కదా? ఆయన్నెందుకు ఇబ్బంది పెడ తారు..?’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు హరీశ్ స్పం దిస్తూ.. ‘పెద్దాయనకు మేమివ్వాల్సిన గౌరవం ఇస్తు న్నాం. మేమెంత గౌరవం ఇస్తున్నామో.. మీరెంత గౌరవం ఇస్తున్నారో రోజూ పత్రికలు రాస్తు న్నా యి. పెద్దాయనను ఎవరు ఇబ్బంది పెడు తున్నారో అందరికీ తెలుసు..’ అని ఎద్దేవా చేశారు.