పదేళ్లకైనా పూర్తవుతాయా?
ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీసిన జానారెడ్డి
♦ మీరు చెప్పే ప్రాజెక్ట్‌ల కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి
♦ ఏటా 25 వేల కోట్లు ఇచ్చినా పదేళ్లు పడుతుందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వం చెబుతున్న సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ కలిపి రూ.2లక్షల కోట్లు కావాలి. ఏటా రూ.25 వేల కోట్లు కేటాయించినా పదేళ్లు పడుతుంది. మరి ఏటా అంత మొత్తం బడ్జెట్లో కేటాయించే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుందా?’’ అని శాసనసభలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి నిలదీశారు. మంగళవారం సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో ఆయన మాట్లాడారు. గతంలోనే మొదలై పెండింగ్‌లో ఉన్న 23 ప్రాజెక్టులను ముందు పూర్తిచేయాలని, తర్వాత ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు చేపట్టినా విపక్షంగా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. 2005లో చేపట్టిన మహాత్మాగాంధీ సాగునీటి ప్రాజెక్టును పదేళ్లు అధికారం లో ఉన్న కాంగ్రెస్, రెండేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఎందుకు పూర్తి చేయలేకపోయాయని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ.. గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఎక్కువ నీటిని వాడుకోలేని పరిస్థితితోనే రీ డిజైనింగ్‌కు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్తే ఎందుకు?
యూనిట్ ధర రూ.5.50 చొప్పున విద్యుత్ కొనుగోలుకు ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయంపైనా జానారెడ్డి నిలదీశారు. విభజన చట్టం ప్రకారం ఏపీలోని మిగులు విద్యుత్‌ను తప్పనిసరిగా తెలంగాణకు ఇవ్వాల్సి ఉందని.. తక్కువ ధరకు వచ్చే ఆ విద్యుత్‌ను కాదని, ఎక్కువ ధరకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. కేంద్రం రూ.4.50కి యూనిట్ చొప్పున సోలార్ విద్యుత్‌ను రాష్ట్రాలకు అందించే అవకాశం ఉన్నట్లు తెలిసిందని, ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్ట్‌ను ‘సబ్ క్రిటిక్’ విధాన ంలో నిర్మిస్తే ఏటా రూ.300కోట్ల చొప్పున భారం పడుతుందని, ‘సూపర్ క్రిటికల్’తో నిర్మిస్తే పాతికేళ్లకు సుమారు రూ.7,500కోట్లు ఆదా అవుతాయని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో 12 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.13వేల కోట్లు అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.