పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జనం ఓటుతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి నిదర్శనమని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పలు సంఘాల నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయడంతో పాటు తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధన విధించాలన్నారు.
ఈ అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలన్నారు. స్పీకర్లు అధికార పార్టీలకు ఏజెంట్లుగా మారి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారన్నారు. స్పీకర్ల నిర్ణయాలపై న్యాయ స్థానాలకు వెళ్లే అవకాశం పార్టీలకు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’పై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెమినార్‌లో ప్రముఖ న్యాయ కోవిధులు జస్టిస్ బి. జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు ఎస్. జైపాల్ రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రసంగిస్తారన్నారు.