
జర్నలిస్టులకు సంక్షేమ నిధి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
► మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
► మరణిస్తే కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం
► శాశ్వత వైకల్యంతో వృత్తికి దూరమైతే రూ.50 వేలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. శాశ్వత వైకల్యంతో వృత్తికి దూరమైన జర్నలిస్టులకు, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఈ సంక్షేమ నిధి నుంచి ఆర్థికసాయాన్ని అందించనున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులకు, ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం పొందిన జర్నలిస్టులకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు.
ఒకవేళ జర్నలిస్టు మృతిచెందితే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయంతోపాటు, ప్రతినెలా రూ. 3 వేల పింఛన్‌ను ఐదేళ్లపాటు అందిస్తారు. కుటుంబ సభ్యుల్లో ప్రాధాన్యత రీత్యా వరుసగా భార్య, తర్వాత తండ్రి, తల్లి, 28 ఏళ్లలోపు నిరుద్యోగ కుమారుడు, 28 ఏళ్లలోపు అవివాహిత నిరుద్యోగ కుమార్తె అర్హులు. మృతి చెందిన జర్నలిస్టు పిల్లలకు 10వ తరగతి వరకు ప్రతినెలా రూ.1000 ట్యూషన్ ఫీజును చెల్లించనున్నారు.
జాతీయస్థాయిలో గుర్తింపుపొందిన జర్నలిజం కళాశాల నుంచి ఫుల్ టైం జర్నలిజం కోర్సు చేసే జర్నలిస్టులకు రూ.లక్ష వరకు ట్యూషన్ ఫీజును రీయింబర్స్‌మెంట్ చేస్తారు. విదేశాల్లోని ప్రతిష్టాత్మక, గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి జర్నలిజం కోర్సుల్లో చేరే జర్నలిస్టులకు రూ. 5 లక్షల వరకు ట్యూషన్ ఫీజును రీయింబర్స్‌మెంట్ చేస్తారు. రూ. 2 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న వర్కింగ్ జర్నలిస్టులు మాత్రమే సంక్షేమ నిధి నుంచి లబ్ధిపొందేందుకు అర్హులు.
అయితే, తక్షణ ఉపశమనం కోసం.. దరఖాస్తు చేసే సమయంలో కుటుంబ ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నుంచే ఈ ఆర్థిక సాయం వర్తింపజేస్తారు. కాగా, దీని అమలులో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలోని జర్నలిస్టు ఫండ్ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై ఆర్థికసాయంపై నిర్ణయం తీసుకోనుంది.