సీఎం డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారు
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విమర్శ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తన హిట్లర్ మాదిరి ఉండటమేగాక డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నందువల్లే రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందట్లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విమర్శించారు. చట్టంలో పొందుపరచిన అంశాల్ని అమలు చేయాలని రెండేళ్ల తర్వాత కూడా మేధావులు కోరాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ పునర్విభజన చట్టం, హామీల అమలు అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని విషయమై ఇటు కేంద్రప్రభుత్వం, అటు ప్రతిపక్షపార్టీలతో మాటమాత్రంగానైనా సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ర్టప్రభుత్వమే చట్టాన్ని అతిక్రమించిందని విమర్శించారు.
అబద్ధాలతో పాలన..: తొమ్మిది క్యాంపు ఆఫీసులకు సీఎం రూ.80 కోట్లు ఖర్చుచేసి రాజధానికోసం ఇటుకలను విరాళాలుగా సేకరించడం విడ్డూరంగా ఉందని సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. రెవెన్యూ లోటు ఉందంటూనే వేలకోట్లు రుణమాఫీ ఏవిధంగా చేశారో చెప్పాల్సిన అవసరముందన్నారు. కాగా ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానం ఆమోదించింది.