డీఈవో జాబితాల్లో మార్పులు చేసిన డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారుల (డీఈవో) జాబితాను సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఖరారు చేసింది. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను కీలకమైన జిల్లాల్లో డీఈవోలుగా నియమించేందుకు విద్యాశాఖ ప్రతిపాదించిన జాబితాను ఊటంకిస్తూ సోమవారం ‘ఆరోపణలు ఉన్న వారికి అందలం!’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనంపై కడియం శ్రీహరి స్పందించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కీలకమైన జిల్లాల్లో డీఈవోలుగా నియమించేందుకు ఎలా ప్రతిపాదనలు పంపించారని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యాశాఖ పంపిన జాబితాలోని జిల్లాల కేటాయింపులకు ఆయన మార్పులు చేశారు. ఆరోపణలు ఉన్న అధికారులకు చెక్ పెడుతూ తాజా జాబితాను రూపొందించి ఆమోదించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.