నగరంలో కన్నడిగులు... | Kannada residents to follow as their traditions even after migrate to hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో కన్నడిగులు...

Published Mon, Aug 25 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

నగరంలో కన్నడిగులు...

నగరంలో కన్నడిగులు...

మినీ భారత్: ఏళ్ల కిందటే భాగ్యనగరానికి వలస వచ్చిన కన్నడిగులు ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ఇడ్లీ, దోశ వంటి తినుబండారాల చిరు వ్యాపారాలు మొదలుకొని ట్రాన్స్‌పోర్ట్, వస్త్ర వ్యాపారాలు, బంగారు, వెండి ఆభరణాల వంటి బడా వ్యాపారాలు చేస్తున్న వారు కొందరైతే, ప్రైవేటు ఉద్యోగాల్లో కుదురుకున్న వారు ఇంకొందరు. ఉపాధి కోసం ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతున్నా, కన్నడిగులు తమ సంప్రదాయాలను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
 
1972లో భారీ వలసలు...
 కన్నడిగుల్లో కొందరు నిజాం కాలంలోనే హైదరాబాద్ నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే, 1972లో కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా తదితర జిల్లాలతో పాటు సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తీవ్రమైన కరువు వాటిల్లినప్పుడు పెద్దసంఖ్యలో కన్నడిగులు నగరానికి వలస వచ్చారు. నగరంలోని గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడీ, చేలాపురా, గౌలిపురా, ఛత్రినాక, ఫిసల్‌బండ, బహదూర్‌పురా, జియాగూడ, బేగంబజార్, మిధాని, దిల్‌సుఖ్‌నగర్, కాచిగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
 
 శాకాహారం... శైవాచారం...
 కన్నడిగుల్లో వీరశైవులు, లింగాయత్‌లు శివలింగానికి పూజచేయడంతో దినచర్య ప్రారంభిస్తారు. జొన్నరొట్టెలు, గోధుమరొట్టెలను ప్రధానంగా స్వీకరించే వీరు పూర్తిగా శాకాహారులు. విందు, వినోదాల్లో సైతం మాంసాహారానికి దూరంగా ఉంటారు. వీరశైవులకు జగద్గురు రేణుకాచార్య కులగురువు కాగా, లింగాయత్‌లకు మహాత్మా బసవేశ్వర కులగురువు. కన్నడిగుల్లో యువతరం ఆధునిక వస్త్రధారణకు అలవాటు పడినా, వయసు మళ్లిన వారు మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వస్త్రధారణతోనే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
 
 కన్నడిగుల ప్రత్యేక పండుగ ‘యాడమాస్’

 ఉగాది, దసరా, దీపావళి, నాగపంచమి పండుగులను తెలుగువారి మాదిరిగానే జరుపుకొనే కన్నడిగులు, ‘యాడమాస్’ పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. పంటలు చేతికొచ్చే సమయంలో జనవరిలో నిర్వహించే ఈ పండుగకు నగరంలోని కన్నడిగులందరూ తప్పనిసరిగా తమ తమ స్వస్థలాలకు వెళతారు. జొన్నరొట్టెలతో పాటు పిండివంటలు చేసుకుని, తమ తమ పొలాలకు వెళ్లి, చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడే సామూహికంగా విందుభోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇక లింగాయత్‌లు తమ కులగురువైన మహాత్మా బసవేశ్వర జయంతిని వేడుకగా జరుపుకొంటారు. ఆ సందర్భంగా పతాకావిష్కరణ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
 పెళ్లిళ్లలో తలపాగా తప్పనిసరి మర్యాద...
కన్నడిగుల పెళ్లిళ్లలో తలపాగా మర్యాద తప్పనిసరి. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో పురుషులందరికీ తప్పనిసరిగా తలపాగా కడతారు. మహిళలందరికీ చీర, పసుపు కుంకుమలు ఇస్తారు. వరుడి ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు వధువు తరఫు బంధుమిత్రులందరికీ ఈ మర్యాదలు చేస్తారు. ఇందులో చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు.
 
 కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలి
కన్నడిగులను లింగ్విస్టిక్ మైనారిటీలుగా గుర్తించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. నగర శివార్లలో మహాత్మా బసవేశ్వర ఆశ్రమ నిర్మాణానికి మూడెకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించాలి. నగరంలోని ప్రధాన కూడలిలో బసవేశ్వర శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కన్నడిగుల కోసం ప్రత్యేక శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలి.
 - నాగ్‌నాథ్ మాశెట్టి, అధ్యక్షుడు, ఏపీ బసవ కేంద్రం,హైదరాబాద్
  పిల్లి రాంచందర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement