కాపు రిజర్వేషన్లపై పవన్ నోరువిప్పలేదేం?
కాకినాడలో నిర్వహించిన సభలో జనసేన చీఫ్, సినీనటుడు పవన్ కల్యాణ్ కాపుల రిజర్వేషన్ అంశంపై నోరు విప్పకపోవడాన్ని కాపునాడు రాష్ట్ర కమిటీ తప్పుపట్టింది. రాష్ట్ర జనాభాలో 27 శాతంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తుల సమస్యలు పవన్కు పట్టవా? అని ప్రశ్నించింది. ఈ మేరకు కాపునాడు కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక సమస్యలను ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొన్నేళ్లుగా పోరాడుతున్న కాపు రిజర్వేషన్లను మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టింది. తమ ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని, పవన్ మద్దతు ఇచ్చిన తెలుగు దేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. జనసేన పార్టీ అధ్యక్షునిగా పవన్‌కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై తమ వైఖరేమిటో ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగే కాపు రిజర్వేషన్ల పోరాట సమితీ జేఏసీల సమావేశంలో ఈ విషయాన్నీ చర్చిస్తామని పేర్కొంది.