అనాథ పిల్లలకు ఎస్సీ హోదా | kcr decision on sc status in assembly sessions | Sakshi
Sakshi News home page

అనాథ పిల్లలకు ఎస్సీ హోదా

Published Fri, Jan 6 2017 2:55 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

అనాథ పిల్లలకు ఎస్సీ హోదా - Sakshi

అనాథ పిల్లలకు ఎస్సీ హోదా

  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన
  • ఎస్సీల రిజర్వేషన్లు తగ్గించకుండానే వారికి అదనపు కోటా ఇస్తాం
  • అనాథలకు ప్రభుత్వమే తల్లీతండ్రీ
  • మార్చి 31లోగా 2015–16 ఫీజుల బకాయిలన్నీ చెల్లిస్తాం
  • ఫీజులను ఏ ఏడాదికా ఏడాది చెల్లించడం సాధ్యం కాదు
  • రాబోయే బడ్జెట్‌లోగా ఫీజుల పథకాన్ని సంస్కరిస్తాం..
  • తప్పుడు మార్గంలో కాలేజీలు నడిపితే మూసేస్తాం
  • సాక్షి, హైదరాబాద్‌
    ‘‘రాష్ట్రంలోని అనాథ పిల్లలకు నూటికి నూరు శాతం ప్రభుత్వమే తల్లీతండ్రీ! వారిని ఎస్సీలుగా పరిగణిస్తాం. ఎస్సీ హోదా కల్పిస్తాం. ఎస్సీల రిజర్వేషన్‌ కోటాను తగ్గించకుండానే అనాథలకు అదనపు కోటా ఇస్తాం..’’ అని సీఎం కేసీఆర్‌  ప్రకటించారు. అనాథ పిల్లలకు ఏ కులం, ఏ మతం హోదా కల్పించినా తక్కువేనని అన్నారు. గురువారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. అంతకుముందు  హైదరాబాద్‌లోని ఓ అనాథాశ్రమంలోని విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తర్వాత దీనిపై సీఎం మాట్లాడుతూ.. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో అనాథ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తామన్నారు.  ఫీజులపై ఒక్క విద్యార్థి కూడా రంధి పడాల్సిన అవసరం లేదని, 2015–16 సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఈ ఏడాది మార్చి 31లోగా 100 శాతం చెల్లిస్తామని హామీనిచ్చారు.

    ‘‘విద్యార్థుల సంఖ్య, ఫీజుల డిమాండ్‌  ఒక్క సంవత్సరం కూడా స్థిరంగా ఉండదు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై సరైన అంచనా సాధ్యం కాదు. దీంతో ఏ ఏడాదికా ఏడాది చెల్లించడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. గతేడాది బకాయిలను ఈ  ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వం చెల్లిస్తుంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే చేసింది’’ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై ప్రేమ లేదని కొందరంటున్నారని, అయితే ప్రేమ ఉందా?  లేదా? అన్నది ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.20 లక్షల ఉపకారవేతనాన్ని చరిత్రలో తొలిసారి ఇస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది రూ.4,687 కోట్ల ఫీజులు రీయింబర్స్‌  చేశామని, అందులో రూ.1,880 కోట్లు గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించని పాత బకాయిలేనని సీఎం వివరించారు.

    ఫీజుల పథకాన్ని సంస్కరిస్తాం
    ఫీజుల పథకం అనారోగ్యంగా ఉందని, రాబోయే బడ్జెట్‌లోగా కొంత సంస్కరించేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందరి అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. తాను అన్ని ఇంజనీరిం గ్‌ కాలేజీలను మూసివేస్తామని చెప్పలేదని, అయితే ఎవరైనా తప్పుడు మార్గంలో, అధ్యాపకులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తే తప్పకుండా మూసివేయిస్తామని స్పష్టంచేశారు. ‘‘ఓ మహిళ అధ్యాపకురాలు ఏకకాలం లో 11 కళాశాలల్లో పనిచేస్తున్నట్లు సీఐడీ తనిఖీల్లో వెలుగు చూసింది. హైదరాబాద్, ఆదిలాబాద్‌ వేర్వేరు ప్రాంతాల్లో డబుల్‌యాక్షన్‌ ఎలా సాధ్యం? తనిఖీలకు సంబంధించిన సమాచారం ముందస్తుగా ఇస్తే రూ.లక్ష లంచం ఇస్తామని  కొందరి ఫోన్లలో మెసేజ్‌లు లభించాయి. విద్యార్థుల కోసం ఇస్తున్న డబ్బులను కొన్ని కళాశాలలు దుర్వినియోగం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు మూతపడతాయి. మరికొన్ని కొత్తవి వస్తాయన్నారు. అందుకే ప్రైవేటు వర్సిటీల బిల్లును తీస ుకువస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

    గత ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తున్నాం
    కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని మార్పులు లేకుండా యథాతథంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులు పాస్‌ కావాలని, 75 శాతం అటెండెన్స్‌ కలిగి ఉండాలని గత ప్రభుత్వం రూ పొందించిన నిబంధనలనే తాము అమలు చేస్తున్నామని చెప్పారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడే ఉన్నత ప్రమాణాల ఆధారంగా కాలేజీలకు వేర్వేరు ఫీజులను నిర్ణయించారని, దీనినే తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. విద్యాసం స్థలు సర్టిఫికెట్లను ఆపుకోకుండా విద్యార్థులకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ‘‘బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ప్రమాణాలున్న కళాశాలల్లో చదువుకోవద్దా? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జనరల్‌  కేటగిరీలో ప్రవేశాల పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లిస్తాం. ముస్లిం విద్యార్థుల్లో 99 శాతం పేదలే. వారికి ఎస్సీ, ఎస్టీలతో సమానంగా అవకాశాలు కల్పిస్తాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను  సైతం జారీ చేసింది. వీటి అమలు బాధ్యతను స్వయంగా నేనే తీసుకుంటా’’ అని వివరించారు.

    జనవరిలో నోట్ల రద్దు ప్రభావం
    నోట్ల రద్దు ప్రభావం అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణపై సైతం తాత్కాలికంగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీని ప్రభావం జనవరిలో తెలుస్తుందన్నారు. ఆ తర్వాత ఫీజులు ఎలా చెల్లించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement