సాక్షి, హైదరాబాద్: రాబోయే బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ ఆలోచనలను ప్రజల కళ్లకు కట్టేలా చూపించిందని, ఈసారి వ్యవసాయానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మంచిస్థానం సంపాదించామని చెప్పారు. బడ్జెట్‌పై కసరత్తు మొదలైందని, అన్ని విభాగాల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందినట్లు వెల్లడించారు.
గురువారం సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనలు, అంచనాలు, ఈ ఏడాది ఖర్చులపై చర్చించారు. బడ్జెట్, బడ్జెటేతర పనులు కలుపుకుంటే అనుకున్న దానికన్నా ఈ ఏడాది ఎక్కువే ఖర్చు చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో ఖర్చు భారీగా పెరిగిందని చెప్పారు. సీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే బడ్జెట్‌పై చర్చలు జరుగుతున్నాయని, వచ్చిన ప్రతిపాదనలన్నీ క్రోడీకరించి, శాఖల వారీగా త్వరలోనే సమీక్షిస్తామని తెలిపారు. మార్చి 12న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని, అప్పటికే కేంద్ర బడ్జెట్‌పై స్పష్టత వస్తుందని అన్నారు.
కేంద్రం గ్రాంట్లు ఇవ్వాలి
మిషన్ భగీరథకు రూ.19,405 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినా కేంద్రం పట్టించు కోవడం లేదని, ఈ నిధులు మంజూరు చేయాలని ఈటల కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. హార్టికల్చర్ వర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, ఎయిమ్స్, స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు కేంద్రం బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు మంజూరు చేయాలని ఇటీవల జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్టు చెప్పారు. కేటాయించిన ప్రతి రూపాయి ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజన చేయాలని, పనిచేసే చోట ఉద్యోగులుండేలా చూడాలని హెచ్‌ఓడీలను ఆదేశించారు.
ఆ పార్టీలకు సీట్లపైనే ప్రేమ
కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలపై ప్రేమ లేదని, ఎన్నికలు, సీట్లు, అధికారంపైనే ప్రేముందని ఈటల విమర్శించారు. మిగులు విద్యుత్ ఉండటం వల్లే తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నారన్న బీజేపీ నేతలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నారు. తాము తీసుకున్న చర్యల వల్లే కరెంటు ఇవ్వగలుగుతున్నారని అంటున్న కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment