రెండేళ్లయినా బెరుకేనా?
కొందరు అమాత్యుల పనితీరుపై సీఎం అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ‘‘మంత్రులుగా బాధ్యతలు తీసుకుని రెండేళ్లు కావొస్తోంది. అయినా బెరుకుగానే ఉంటున్నారు. శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారు. కొందరికి కనీసం బడ్జెట్ ఎలా రూపొందించుకోవాలో కూడా తెలియడంలేదు’’ అని సీఎం కేసీఆర్ కొంద రు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం కొన్ని రాజకీయాంశాలు మాట్లాడినట్లు సమాచారం.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం దక్కడంతో పలువురు మంత్రులు సీఎంకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం కోసం మంత్రులు గల్లీగల్లీ తిరిగారు. ఇప్పుడు ఒక్కసారే మాయం కావొద్దు. హైదరాబాద్ కార్యక్రమాల్లో కనిపించండి’’ అని అన్నారు.
హైదరాబాద్‌కు అన్ని శాఖలతో సం బంధం ఉంటుంది కాబట్టి మంత్రులు నిత్యం ఇక్కడ కనిపించాలన్నట్టు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన పాత, కొత్త కేడర్‌లతో మంత్రులు విధిగా సంబంధాలు కలిగి ఉండాలని, వారిని పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దాలని చెప్పారు.
గ్రేటర్ ఫలితాల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ తెలిసిందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు టీఆర్‌ఎస్‌వే కావాలని నిర్దేశించినట్లు సమాచారం. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా మంత్రులు వారంపాటు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సారథ్య బాధ్యతలు మోసిన మంత్రి కేటీఆర్‌కు మంత్రివర్గ సహచరులంతా అభినందనలు తెలిపారు.