ఏం జరుగుతోంది... నాకు తెలియాలి: కేసీఆర్
హైదరాబాద్: భద్రాచలం శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారి పురాతన విగ్రహాల బంగారు తాపడం అంశంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్ వివరణ కోరారు. రామదాసు కాలం నాటి పురాతన విగ్రహాలకు ఉన్న బంగారు తాపడం జీర్ణం కావటంతో కొత్తవి చేయించే క్రమంలో జరిగిన గందరగోళంపై ఇటీవల పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. అంతర్గతంగా జరుగుతున్న విషయాలు బయటకు పొక్కకుండా పూర్తి గోప్యతను పాటిస్తుండటంతో భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న తీరును పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. ఎంత బంగారాన్ని కరిగించారు, దాని క్యారెట్ల విలువేంటి, అందుకు దేవాదాయశాఖ నుంచి అనుమతులున్నాయా, కొత్తగా మరికొంత బంగారాన్ని కరిగించేందుకు నగరంలోని మింట్‌కు తరలించటం లాంటి అంశాలపై ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడటం పట్ల అనుమానాలు వెల్లువెత్తాయి.
దీనిపై దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ అధికారుల వివరణ కోరారు. ఈ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును కూడా ఆయన తప్పుపట్టినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా అశేష సంఖ్యలో భక్తులున్న భద్రాచలం రామాలయానికి చెందిన కీలక విషయాల్లో కూడా భక్తులకు ఎలాంటి సమాచారం లేకుండా అంతర్గతంగా గుట్టుగా పనులు నిర్వహించటం పట్ల గందరగోళం నెలకొంది. ఈ గందరగోళమేంటో, అసలు ఆలయంలో జరుగుతున్న పనులేంటో తనకు తెలపాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆ శాఖ కార్యదర్శిని ప్రశ్నించారు. ఈమేరకు రెండు రోజుల క్రితం సీఎం కార్యాలయం నుంచి దేవాదాయశాఖ కార్యదర్శి కార్యాలయానికి శ్రీముఖం అందింది. మరోవైపు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా దీనిపై అధికారులను వివరణ కోరారు.