పెళ్లికి పట్టుబడుతున్న.. కేసీఆర్ దత్తపుత్రిక
సాక్షి, హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా..? తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లబోతోందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కన్నతల్లి మరణంతో, సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో ప్రత్యూషను మీడియా, బాలల హక్కుల సంఘాలు చొరవతో ఆస్పత్రిలో చేర్పించటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హై కోర్టుల స్పందనతో ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నఆమె యోగక్షేమాలను అధికారుల ప్రత్యేకంగా చూస్తూవస్తున్నారు.
ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వోకేషనల్ పరీక్ష సైతం పాసైయ్యారు. అయితే, బీఎస్సీ నర్సింగ్ చేయటమే లక్ష్యంగా చెబుతూ వచ్చిన ప్రత్యూష.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు.
ఈ విషయాన్ని మహిళ సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా ప్రత్యూష తెలిపారు. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలు మార్లు కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నపటికీ.. ప్రస్తుతం తనకు ఇరవై ఏళ్లని, మేజర్‌నంటూ.. నా ఇష్టప్రకారం నేను కోరుకున్నది చేయాలంటూ ప్రత్యూష పట్టుపడుతున్నట్లు తెలిసింది.
ఎవరీ మద్దిలేటి రెడ్డి..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారీకాలనీకి చెందిన మద్దిలేటి రెడ్డి(27) బీఎస్సీ చదివి ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చి అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించాడు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ నంబర్ ఇచ్చాడు. నగరంలో ఉన్న రెండు రోజుల ప్రత్యూష వద్దకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లిపోయాడు. తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ గృహంలో చేరింది. అప్పటినుంచి మద్దిలేటికి ఫోన్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది.
హాస్టల్‌లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా ప్రత్యూష
ప్రస్తుతం తాను హాస్టల్లో ఉండలేకపోతున్నానని, హాస్టల్ భోజనంలో సోడా ఉప్పు వేస్తున్నారని, ఉడకని బియ్యంతో అన్నం తినడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతోందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావుకు ఆమె ఫోన్ చేసి చెప్పారు. మద్దిలేటిని పెళ్లి చేసుకున్నాకే తాను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని వివరించారు. తాను ప్రేమించిన మద్దిలేటితోనే వివాహం జరిపించాలని కోరారు.
ఆమెనే పెళ్లి చేసుకుంటా: మద్దులేటిరెడ్డి
అవును.. ప్రత్యూషను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మ తులసమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పే వాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు మేమంతా అంగీకరించాం. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి తెలిపారు.
ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి : అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్‌సభ్యులు
ప్రత్యూషను ఆస్పత్రి నుండి తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత, ఆమెకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించ లేదు. పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఆమె వాటన్నింటి నుంచి ఇప్పటికిప్పుడు బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు.