నల్లధనంతోనే రాష్ట్రం నడుస్తోందా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లీకులివ్వడం బాధాకరమని, నల్లధనంతో జరిగే లావా దేవీలతోనే ప్రభుత్వం నడుస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో విద్యుత్ బిల్లుల కౌంటర్లు, జీహెచ్‌ఎంసీ బిల్లుల వసూలు కేంద్రాలు అర్థరాత్రి వరకూ నడుస్తున్నాయని, పాత బకారుులు వసూలవుతున్నాయని, ఆదాయం పెరుగుతోందని చెబుతున్న ప్రభుత్వమే అందుకు భిన్నంగా మాట్లాడటం ఆశ్చర్యకరమన్నారు.
నోట్ల రద్దు వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, తగ్గినట్టు అబద్ధాలు ప్రచారం చేయడం మంచిదికాదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, వృథా ఖర్చులు, ఆడంబరాల కోసం ఖజానాను కొల్లగొట్టిన కేసీఆర్.. తన అసమర్థతను ప్రధాని మోదీపై నెట్టడానికి యత్నిస్తున్నాడని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తే, నల్లధనాన్ని అరికడితే పక్కనున్న పాకిస్తాన్ భయపడాలిగానీ కాంగ్రెస్ నేతలెందుకు భయపడుతున్నారో అర్థంకావడంలేదని కిషన్‌రెడ్డి అన్నారు.