వివాదం వచ్చినప్పుడే వాటాలు గుర్తుకొస్తే ఎలా?
♦ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ
♦ నీటి అవసరాలపై సమాచారం అడిగితే
♦ స్పందించడం లేదని ఆక్షేపణ
♦ డేటా ఉంటేనే మార్గదర్శనం చేయవచ్చని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వాస్తవ, భవిష్యత్ అవసరాలకు సంబంధించి డేటా సమర్పించే విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సరైన రీతిలో స్పందించకపోవడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అసహనం వ్యక్తం చేసింది. వివాదాలు వచ్చినప్పుడు మాత్రమే రెండు రాష్ట్రాలు స్పందిస్తున్నాయి తప్పితే, ఏడాదిగా వివరాలు కోరుతున్నా.. స్పందన కరువైందని, ఇలాంటి పరిస్థితుల్లో మార్గదర్శనం చేయడం అంత సులువు కాదని బోర్డు నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఇటీవల కనీస నీటి మట్టాలకు దిగువన నాగార్జునసాగర్, శ్రీశైలంలో ఉన్న నీటి లెక్కలను గణించి, ఏపీకి 6 టీఎంసీలు, తెలంగాణకు 3 టీఎంసీలు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఘాటుగా లేఖ రాసింది.
ఇరు రాష్ట్రాల వాస్తవ వినియోగ లెక్కలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయలేదని, ఈ దృష్ట్యా సాగర్ నుంచి ఏపీ అవసరాలకు నీటిని విడుదల చేయలేమని స్పష్టం చేసింది. ఈ లేఖ నేపథ్యంలోనే బోర్డు ఇరు రాష్ట్రాలకు సోమవారం విడివిడిగా లేఖలు రాసింది. ‘‘గత ఏడాది జూన్‌లో జరిగిన సమావేశం సందర్భంగా వాస్తవ అవసరాలను, భవిష్యత్ అవసరాలను సమర్పించాలని బోర్డు సూచించగా, ఇరు రాష్ట్రాలు సమ్మతించాయి. అయితే ఇంతవరకు అలాంటి సమాచారం బోర్డుకు అందివ్వలేదు. దీనిపై పలుమార్లు బోర్డు చైర్మన్, బోర్డు సభ్య కార్యదర్శి వివరాలు కోరినా స్పందన లేదు.
ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగ డేటాను ఇరు రాష్ట్రాలు, బోర్డు ద్వారా పరస్పర బదిలీ చేసుకోవాల్సి ఉన్నా అదీ జరగడం లేదు. కేవలం నీళ్లు అత్యవసరం అయినప్పుడు మాత్రమే నీటి వాటా, వినియోగ లెక్కల అంశాలను ప్రస్తావిస్తున్నారు’’ అని బోర్డు లేఖలో పేర్కొంది. ఇరు రాష్ట్రాల తాగు నీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటి వాటాల్లోంచే ఆ నీటిని వాడుకోవాలన్నారు. అయితే బోర్డు వద్ద నీటి వినియోగం, భవిష్యత్ అవసరాల డేటా లేక అది సాధ్యం కావడం లేదంది.