రావమ్మా.. కృష్ణమ్మా
- నేటి రాత్రి లేదా రేపు ఉదయానికి రాష్ట్రానికి కృష్ణా నీరు
- నిండిన ఆలమట్టి.. 95 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- నారాయణపూర్ నుంచి దిగువకు 77 వేల క్యూసెక్కులు
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రెండేళ్లుగా కనికరించని కృష్ణమ్మ.. ప్రస్తుతం దిగువకు పరుగులు పెడుతోంది. రాష్ట్ర ప్రాజెక్టుల వైపు కదలి వస్తోంది. ఆల మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల గేట్లు ఎత్తడంతో కృష్ణా ప్రవాహాలు బుధవారంరాత్రికి లేక గురువారం ఉదయం జూరాలకు చేరే అవకాశాలున్నాయి. నారాయణపూర్ డ్యామ్ నుంచి ఏకంగా 77 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ఆల మట్టి నుంచి నీటి విడుదల భారీగా ఉండటంతో నారాయణపూర్ నుంచి ఔట్ ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
మనకు వచ్చింది 8 టీఎంసీలే..
కృష్ణమ్మ రాక కోసం తెలంగాణ ప్రాజెక్టులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కర్ణాటకలోని ప్రాజెక్టుల్లో సుమారు 200 టీఎంసీల నీరు చేరగా.. రాష్ట్రంలోని ప్రాజెక్టులో మాత్రం కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. దీంతో ప్రాజెక్టులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 590 అడుగుల మట్టానికిగానూ నీటినిల్వ 503 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో 885 అడుగులకుగానూ 788 అడుగులో 23 టీఎంసీల నీటి లభ్యత ఉంది. జూరాలలోనూ 9.66 టీఎంసీలకుగాను 3.58 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.
నిండు కుండల్లా ఎగువ ప్రాజెక్టులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఆలమట్టిలో ఈ నెలలోనే 128 టీఎంసీల కొత్త నీరు చేరింది. ఆలమట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1,703.74 అడుగులకు నీరు చేరింది. 129.7 టీఎంసీలకుగానూ సోమవారం ఉదయానికి 122.80 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఎగువనుంచి ప్రాజెక్టులోకి 95,656 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌లోకి 93,230 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో 37.64 టీఎంసీల సామర్థ్యానికిగాను మంగళవారం ఉదయం 34.87 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ప్రవాహాలు భారీగా వస్తుండటంతో దిగువకు 77,655 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.