
మహా అధ్యయన యాత్ర
సీపీఎం పాదయాత్రపై బీవీ రాఘవులు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాజన పాదయాత్ర బడుగు, బలహీనవర్గాల సమస్యలపై మహాఅధ్యయన యాత్రగా సాగనుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 17 నుంచి మార్చి 12 వరకు 4 వేల కి.మీ. మేర నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని.. వారి సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో యాత్రలో పాల్గొననున్న నేతలను మంగళవారం ఎంబీ భవన్‌లో రాఘవులు పరిచ యం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ర్టంలో అనేక కారణాలవల్ల తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీలు వెనకబడ్డారని, ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడినా పాత విధానాలే కొనసాగుతున్నాయని, కార్పొరేటీకరణ మరింత వేగం పుంజుకుందన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తెలంగాణ కావాలన్న అంశంపై ఓ చర్చాపత్రాన్ని పాదయాత్ర ద్వారా సీపీఎం ప్రజల్లోకి తీసుకెళుతోందన్నారు.
అర్థమయ్యేలా చెప్పండి...
బంగారు తె లంగాణ అంటే ఎట్లా ఉంటుందో, దాని వల్ల ఏం మేలు జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. బడుగులు, బలహీనవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోకుండా పాత విధానాలే అవలంబిస్తోందన్నారు. జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్షాన్ని పిలిచేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జిల్లాలను ప్రకటించినంతనే అభివృద్ధి జరగదన్నారు.
జిల్లాల వికేంద్రీకరణ మండల స్థాయి నుంచి జరగాలన్నారు. బడుగుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో లెఫ్ట్, ప్రోగ్రెసివ్, డెమొక్రటిక్, సోషల్ ఫోర్సెస్‌ను కలుపుకుని ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా సాగుతామన్నారు.