45 సీట్లపై మజ్లిస్ ఆశలు!
పాతబస్తీలో వన్‌వే...
సంఖ్య తగ్గదంటున్న పార్టీ వర్గాలు
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ సరళి బట్టి 45కు పైగా డివిజన్లలో విజయం తథ్యమని మజ్లిస్ పార్టీ అంచనా వేస్తోంది. పాతబస్తీలోని పూర్తి స్థాయి డివిజన్లతోపాటు నగరంలోని పలు డివిజన్లపై సైతం ఆశలు పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో సంఖ్య తగ్గదన్న ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. డివిజన్ల డీలిమిటేషన్, సిట్టింగ్ సీట్ల రిజర్వేషన్ల తారుమారు జరిగినా ఓటింగ్ సరళిలో మాత్రం మార్పులేదని భావిస్తున్నారు. అయితే పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మారిన రాజకీయ సమీకరణలతో పాతబస్తీలోని మూడు నాలుగు డివిజన్‌ల్లో ధీటైన పోటీ జరిగినట్లు ఓటింగ్ సరళి బట్టి స్పష్టమవుతుందంటున్నారు. ఈసారి ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 60 స్థానాల్లో ఎంఐఎం త మ అభ్యర్ధులను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసి 43 స్థానాలను దక్కించుకుంది.
గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈసారీ పునరావృత్తం అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్నేహపూర్వక బంధం కాస్త ఈసారి శత్రుపక్షంగా మారింది. దీంతో పురానాపుల్, ఘాన్సీబజార్, శాలిబండా, లంగర్‌హౌస్, రెడ్‌హిల్స్, మల్లేపల్లి, జాంబాగ్ తదితర డివిజన్లలో గట్టిపోటీ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. ఆజాంపురా, ఓల్ట్ మలక్‌పేట, బోలక్‌పూర్, బోరబండ, అంబర్‌పేట తదితర డివిజన్లలోనూ పోటాపోటీ ఉందని భావిస్తున్నారు.