మా ‘వాక్’ వినండి! | many benefits of morning walk | Sakshi
Sakshi News home page

మా ‘వాక్’ వినండి!

Published Sat, Nov 8 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

మా ‘వాక్’ వినండి!

మా ‘వాక్’ వినండి!

ఆరోగ్యమే మహా ‘భాగ్యం’    నడక, యోగాతో అనారోగ్యానికి చెక్
మార్నింగ్ వాక్‌తో ఎన్నో ప్రయోజనాలు

 
కిటికీ రెక్కలు దాటుకొని వచ్చే సూర్య కిరణాలు నిద్ర లేపి.. ఇబ్బంది పెడుతున్నాయని విసుక్కోవద్దు... మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండని
 గుర్తు చేస్తున్నాయని గ్రహించండి. తలుపు తెర(డోర్ కర్టెన్) అటువైపు లాగేసి... సూర్యుడి కంట పడకుండా ఉండిపోవచ్చని భావించకండి. ఆరోగ్యాన్నిచ్చే ఆదిత్యుని మాట వింటే... అనారోగ్యం మనవైపు చూడడానికే భయపడుతుందని గ్రహించండి. దుప్పటి లాక్కుని
 చలి నుంచి తప్పించుకుంటున్నామని భ్రమిస్తున్నారేమో...ఆ ముసుగులోనే వ్యాధులు మనల్ని కౌగిలించుకుంటున్నాయని తెలుసుకోండి. లేవండి. నడవండి. ఆరోగ్య ప్రపంచం వైపు సాగండి.
 
ప్రతి రోజూ ఉదయాన్నేనాలుగు అడుగులు నడిస్తే ఏమవుతుంది? బద్ధకం వదిలిపోతుంది. అలాగే మరో అరగంట నడిస్తే కొంచెం ఆయాసంగా అనిపించినా... మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఎముకల దృఢత్వానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. పైసా ఖర్చు లేకుండా సంపాదించుకునే ఆరోగ్యాన్ని కొంత మంది కేవలం బద్ధకం వల్ల దూరం చేసుకుంటున్నారు. పాతికేళ్లు నిండకముందే హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండెపోటు, ఊబకాయం, తదితర జబ్బుల బారిన పడుతున్నారు. మారిన  జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చిన్న వయసులోనే పెద్ద జబ్బులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మార్నింగ్ వాక్, యోగా, వ్యాయామాల వల్ల ఆరోగ్యాన్ని పదిలపర్చుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు.
 
గుండెకు మేలు

హైదరాబాద్ నగరం రాష్ట్రానికి మాత్రమే కాదు... హృద్రోగులకూ రాజధానిగా మారుతోంది. పాతికేళ్ల క్రితం గుండె జబ్బులు చాలా అరుదు. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఈ సమస్య ఉండేది. నేడు ఏ కార్పొరేట్ ఆస్పత్రిలో వైపు చూసినా 70-100 మంది హృద్రోగులు తారస పడుతున్నారు. వీరిలో 50 ఏళ్ల లోపు వారే ఎక్కువ. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో ప్రతి వంద మందిలో ముగ్గురు గుండె నొప్పితో బాధ పడుతుండగా...గ్రేటర్‌లో ఈ సంఖ్య 5నుంచి 6 వరకూ ఉంటోంది. వీరు నిత్యం కనీసం 40 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని..తద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని ప్రముఖ గుండె మార్పిడి వైద్య నిపుణుడు డాక్టర్ ఏజీకే గోఖలే చెప్పారు. మంచు కురిసే సమయంలో కాకుండా సూర్య కిరణాలు వ చ్చిన తర్వాత వ్యాయామం చేయడం ఉత్తమం.

ఒత్తిడిని జయిస్తేనే...

ఉరుకుల పరుగుల జీవితం.. రోజంతా కంప్యూటర్లతో సహవాసం.. ఆలస్యపు పెళ్లిళ్లు..ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి..  సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భార్య ఒక షిఫ్టులో పని చేస్తే.. భర్త మరో షిఫ్టులో పని చేయాల్సి వస్తోంది. ఫలితంగా స్త్రీ, పురుషుల హార్మోన్లలో సమతుల్యత లోపించి, సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. ఐటీహబ్‌గా పెరుగాంచిన హైటెక్ నగరంలో ప్రస్తుతం నూటికి 30 శాతం మంది ఐటీ దంపతులు పిల్లల కోసం పరితపిస్తున్నారు. ఉదయాన్నే లేచి యోగాసనాలు చేయడం, శారీరక బరువును అదుపులో ఉంచుకోవడం... మార్నింగ్ వాక్ చేయడం.. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడం వల్ల సంతాన ప్రాప్తికి అవకాశం ఉంటుందని స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ పద్మజ సూచించారు.

స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది

వాతావరణంలో ఓజోన్ 100 మైక్రో గ్రాములు దాటకూడదు. పగటి వేళ 120-150 మైక్రోగ్రాములు దాటుతోంది. సీసం, ఆర్సినిక్, నికెల్ వంటి భారలోహ ధాతువులు కలిగిన గాలి పీల్చితే అది శ్వాసకోశాల్లోంచి రక్తంలోకి చేరుతుంది. ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యంతో ముక్కు ద్వారాలు మూసుకుపోయి...గాలి తీసుకోవడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తిని దెబ్బ తీస్తుంది. పిల్లల ఎదుగుదలను నిరోధిస్తుంది. తెల్లవారు జామున వాకింగ్‌కు వెళ్లడం వల్ల స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చని ఫల ్మనాలజిస్ట్ డాక్టర్ సునంద చెప్పారు.

విటమిన్ ‘డి’

నైట్‌షిఫ్ట్‌ల వల్ల నగరంలో చాలా మంది మధ్యాహ్నం తర్వాత నిద్ర లేస్తున్నారు. ఉదయం ఏడు గంటల్లోపు వచ్చే సూర్యకిరణాల్లో ఎముకల పటిష్టతకు అవసరమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు, గృహిణులు సూర్యరశ్మికి నోచుకోవడం లేదు. కాల్షియం లోపంతో ఎముకల్లో పటుత్వం తగ్గిపోతోంది. విటమిన్ డి లోపం వల్ల గ్రేటర్‌లో 60 శాతం మంది కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. బాధితుల్లో 60 శాతం మహిళలు ఉంటే, 40 శాతం పురుషులు ఉన్నారు. సాధారణంగా 50 ఏళ్లుపైబడిన వారిలో కనిపించే ఈ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్ల యువతీ యువకుల్లో క నిపిస్తున్నాయి. తొలి సంధ్యవేళలో వ్యాయామం చేయడం వల్ల ఎముకల పటుత్వానికిఅవసరమైన విటమిన్ డని పొందవచ్చని ప్రముఖ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల వైద్య నిపుణుడు డాక్టర్ అఖిల్ దాడి చేప్పారు.
 
 
‘భారం’ కాకుండా ఉండాలంటే...

అధిక బరువు.... మనకు తెలియకుండానే మన శరీరాన్ని రోగాల పుట్టగా మార్చేస్తుంది. ఇది ఒక వ్యాధి కాకపోవచ్చు. కానీ, అనేక ఇతర సమస్యలకు కారణమవుతోంది. నగరంలో 2005లో స్థూలకాయుల సంఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం ఇది 40 శాతానికి చేరుకున్నట్లు అంచనా. తగ్గిన శారీరక శ్రమ.. నిశిరేయిలో విందులు, వినోదాలు.. పిజ్జాలు, బర్గర్లు...శరీరంలో కొవ్వును పేర్చేస్తున్నాయి. మార్నింగ్ వాక్, జిమ్‌కు వెళ్లడం, యోగాసనాలతో బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చని ప్రముఖ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహిధర్ వల్లేటి చెప్పారు.
 
రోగాలకు ముకుతాడు


వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కేలరీలు కరిగిపోతాయి. గుండె, కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. అనేక జబ్బులకు మధుమేహం, అధిక బరువే కారణం. వీటి వల్ల వచ్చే  వ్యాధులను వ్యాయామంతో అదుపులో ఉంచుకోవచ్చు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి, ఆహరపు అలవాట్లు మార్చుకోవాలి. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు ఫిజికల్ ఎక్సర్‌సైజ్/ యోగాచేయాలి. ఇలా వారానికి కనీసం 150 నిమిషాలు చేయాలి. బీపీ 140/90, షుగర్ ఫాస్టింగ్‌లో 100/120, పోస్ట్ లంచ్‌లో 140/180 మించకుండా చూసుకోవాలి.
 - డాక్టర్ ఎం.గోవర్థన్, జనరల్ ఫిజిషియన్, కేర్ ఆస్పత్రి
 
యోగాతో ఎంతో మేలు

యోగాతో నయం కాని వ్యాధి లేదు. సర్వరోగ నివారిణి ఇది. వివిధ రకాల దీర్ఘకాలిక రుగ్మతలతో బాధ పడుతున్న వారు వాటిని నయం చేసుకునేందుకు యోగా గురువులను ఆశ్రయిస్తున్నారు. శారీరకంగానే కాకుండా మానసిక పరివర్తనలో చాలా మార్పులు తీసుకువస్తుంది. మందులకు లొంగని క్యాన్సర్‌ను ప్రాణాయామంతో జయించవచ్చు. అర్థమత్స్యేంద్రాసనం, వకునాసనం, మండుకాసనాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఉత్తనపదాసనం, నవుకాసన ంతో అధిక బరువును, పవనముక్తాసనంతో గ్యాస్ట్రిక్ సమస్యలను జయించవచ్చు. ప్రాణాయామం, వసాసనం, మత్స్యాసనంతో శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇలా ఒక్కో జబ్బుకు ఒక్కో ప్రత్యేక ఆసనం ఉంది.

 - బి.చంద్రారెడ్డి గురూజీ, సప్తరుషి యోగ విద్యాకేంద్రం, ఫిలింనగర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement