
బంధువు చనిపోయాడంటూ... పెళ్లికి నిరాకరణ
పోలీసులకు బాధితుల ఫిర్యాదు
చిలకలగూడ: తమ బంధువు మృతి చెందారని చెప్పి... సుష్టి (సూతకం) ఉంద నే సాకుతో పెళ్లి వాయిదా వేయాలని కోరిన వరుడిపై వధువు తరఫు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలకలగూడ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ... బౌద్ధనగర్ గొల్లపుల్లయ్యబావికి చెందిన వరిగంటి బాలయ్య, సత్తెమ్మల కుమార్తె (21)కు హయాత్ నగర్‌కు చెందిన సతీష్ యాదవ్‌తో ఈ నెల 30న (శుక్రవారం) ఉదయం 11.20 గంటలకు పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వేకువజామున పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తమ బంధువు మృతిచెందాడని...సూతకం వల్ల పెళ్లి వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పారు.
దీంతో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు హయత్‌నగర్ వెళ్లి పెళ్లి కొడుకు కాళ్లావేళ్లా పడ్డారు.
తాము అన్నీ సమకూర్చుకున్నామని... వివాహం వాయిదా అంటే చాలా ఇబ్బంది పడతామని చెప్పడంతో శుక్రవారం సాయంత్రం మరో ముహూర్తం ఉందని.. ఆ సమయానికిపెళ్లి చేసుకుంటానని నచ్చజెప్పాడు. సాయంత్రం మరోమారు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. దీంతో కావాలనే కుంటి సాకులతో పెళ్లికి నిరాకరిస్తున్నాడని వధువు తల్లిదండ్రులు గుర్తించారు. తమను మోసగించారని ఆరోపిస్తూ వరుడు సతీష్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రత్యేక బృందాన్ని హయత్‌నగర్ పంపించామని పోలీసులు తెలిపారు.