జూన్‌ 2న మెట్రో పరుగులు! | Metro runs on June 2! | Sakshi
Sakshi News home page

జూన్‌ 2న మెట్రో పరుగులు!

Published Mon, Jan 16 2017 12:53 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

జూన్‌ 2న మెట్రో పరుగులు! - Sakshi

జూన్‌ 2న మెట్రో పరుగులు!

నాగోల్‌–బేగంపేట, మియాపూర్‌–ఎస్‌.ఆర్‌.నగర్‌ మార్గాల్లో..  

సాక్షి, హైదరాబాద్‌: మెట్రోరైలు ప్రాజెక్టును నాగోల్‌–బేగం పేట (16 కి.మీ.), మియాపూర్‌– ఎస్‌.ఆర్‌.నగర్‌ (11 కి.మీ.) మార్గాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ మైన జూన్‌ 2న ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నా హాలు ప్రారంభించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్, ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందం సభ్యులు ఆదివారం నాగోల్‌–బేగంపేట మార్గంలో మెట్రో పనులను, స్టేషన్లను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ రూట్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయాలని హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులను ఆదేశించారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ఫీడర్‌ బస్సులు నడపడం, ప్రయాణికులు, పాదచారుల భద్రతకు తీసుకున్న చర్యలు, సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

పరేడ్‌ గ్రౌండ్స్, జింఖానా మైదానం వద్ద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌ను, బైక్‌ స్టేషన్లను పరిశీలించారు. మెట్రో మార్గాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్‌బెల్ట్, ప్రయాణికులకు కల్పించిన వసతులు బాగున్నాయని హెచ్‌ఎంఆర్, ఎల్‌అం డ్‌టీ అధికారులను ప్రశంసించారు. జూన్‌ 2న ప్రారంభం కానున్న మెట్రో మార్గాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాల ను పూర్తిస్థాయిలో కల్పించనున్నామన్నారు. ఈ రూట్లలో మెట్రో ప్రారంభానికి కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ మంజూరైందని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సీఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు. మెట్రో స్టేషన్ల నుంచి ఫీడర్‌ బస్సులు నడుపుతామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యా లు కల్పిస్తున్నామన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు ఆకాశ వంతెనలు (స్కైవాక్స్‌) నిర్మిస్తున్నామని తెలిపారు. మెట్రో మార్గాలను పరిశీలించిన వారిలో మున్సిపల్‌ పరిపాలన శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్‌ తదితరులు ఉన్నారు.

ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష
ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎస్‌ ఎస్పీసింగ్‌ వివిధ విభాగాల ఉన్నతాధికారులతో మెట్రో పనులపై సమీక్ష నిర్వహించారు. బంజారాహిల్స్‌లో పోలీస్‌ విభాగం నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో మెట్రో ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ను అనుసంధానించ డం ద్వారా మెట్రో కారిడార్లు, స్టేషన్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్‌ ఆదేశించారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్‌ ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు. మెట్రో కారిడార్ల అభివృద్ధికి నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎస్‌ ఆదేశించారు. పలు ప్రధాన మార్గాల్లో మెట్రో పనులకు ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement