హైదరాబాద్, సాక్షి: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఇప్పటికే తన కాలేజీ గురించి, తన మెడికల్ సర్టిఫికెట్ గురించి స్పష్టత ఇచ్చానని ఆయన ఆదివారం విలేకరులతో తెలిపారు. అయినప్పటికీ కావాలనే రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదన్నారు. ఆరోపణలు చేసే వారే పదిమంది జర్నలిస్టులను సెలెక్ట్ చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకువెళ్లేందుకు తాను సిద్ధమని వ్యాఖ్యానించారు. వాళ్లే నిజనిర్ధారణ చేయాలని, తన సర్టిఫికెట్లు తప్పు అని తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
ఎన్నికల అఫిడవిట్లో కూడా నిజాలే పేర్కొన్నానని, తప్పులు ఉంటే ఎన్నికల సంఘం చూసుకుంటుందని చెప్పారు. సంపత్ రావు అనే వ్యక్తి తన క్లాస్‌మేట్ కాదని, తాను చదివేటప్పుడు తమ లెక్చరర్ అని తెలిపారు. జర్నలిస్ట్ కమిటీని ఎప్పుడు పంపినా తాను సిద్ధంగా ఉంటానన్నారు. లేదంటే ఆరోపణలు చేసే వారు కానీ, మీడియా కానీ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించొద్దని సూచించారు. మంత్రి లక్ష్మారెడ్డి నకిలీ డాక్టర్ అని, ఎంబీబీఎస్ పూర్తి చేయకుండానే డాక్టర్ అని ఆయన చెప్పుకుంటున్నాడని రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపణలు గుప్పించిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment