
కలలు .. కల్లలాయే..!
‘ముఖ్యమంత్రి మనకంటే ఎవరికి దగ్గర... ఒక ఎమ్మెల్సీ పోస్టు ఖాళీ అవుతోంది. ఆ సీటు మనదే. మీరంతా కొద్దిగా ఓపిక పట్టండి. నెల తిరక్కుండానే హోం మంత్రినై తిరిగొస్తా...’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ నేత కలల్లో తేలిపోతూ తన అనుచరగణానికి అదే విషయం ఊదరగొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సదరు నేతను ఇప్పటికే ఓ నామినేటెడ్ పదవి వరించింది. అయినా ఆయన చట్టసభల్లో కాలుమోపాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. శాసనమండలి సభ్యుడిగా ఉండి పాలేరు అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక ఖాళీ ఏర్పడింది.
ఇక ఆ స్థానం తనదేనన్న ధీమాతో సదరు పాలమూరు నేత అయినవారికి, అనుచరులకు తనకు వరించ బోయే పదవుల గురించి చెప్పుకున్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాజీనామా చేయిస్తారని, ఆయనను రాజ్యసభకు పంపుతారని రీజనింగూ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎంపికకావడం, ఆ వెంటనే హోం శాఖ పగ్గాలు చేపట్టడం చకచకా జరిగిపోతాయని అనుచరులకు రంగుల సినిమా చూపించారు. కానీ, ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరును అధినాయకత్వం ప్రకటించింది. మరోవైపు రెండు రాజ్యసభ స్థానాలకూ అభ్యర్ధులను ప్రకటించగా అందులో నాయిని లేరు. మరి తమ నేత హోంమంత్రి అయ్యేదెట్టబ్బా అని తలలు బద్దలు కొట్టుకోవడం కార్యకర్తల వంతైంది.