మీరు ఎక్కడైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డారా? లేదా అనేది నిర్థారించుకునేందుకు ఇక నుంచి ప్రత్యేక యాప్ ద్వారా
సాక్షి, సిటీబ్యూరో: మీరు ఎక్కడైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డారా? లేదా అనేది నిర్థారించుకునేందుకు ఇక నుంచి ప్రత్యేక యాప్ ద్వారా మీ మొబైల్ ఫోన్‌లోనే చూసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం చలానాలపై క్యాష్‌లెస్ విధానం అమలు చేస్తున్నామని, వాహనదారులు పెండింగ్ చలానాలు బ్యాంక్ లు, నెట్ బ్యాంకింగ్, ఈ-సేవా, మీ-సేవా ద్వారా చెల్లించాలని ఆయన సూచించారు. క్యాష్‌లెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ఏపీకే ఈ-చలాన్ తెలంగాణ అనే పేరుతో ఉన్న యాప్‌ను ఆడ్రాయిడ్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ యాప్ ఓపెన్ చేసి అందులో వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డారా? లేదా అనే వివరాలు తెలుస్తాయన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే అందుకు సంబంధించిన ఇమేజ్ (చిత్రం)తో పాటు సమయం, తేదీ, ప్రాంతం అందులో ఉంటుందన్నారు.