మోడీతో చర్చ.. నిరాశ
- హైదరాబాదీకి దక్కని అవకాశం
- సమయంలేనందుకు చింతిస్తున్నా: మోడీ
గోల్నాక, న్యూస్‌లైన్: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ప్రచార వ్యూహంలో భాగంగా బుధవారం ప్రారంభించిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో హైదరాబాద్‌వాసికి ఆన్‌లైన్‌లో మోడీతో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి దక్కకుండా పోయింది. అంబర్‌పేట నియోజకవ ర్గంలోని ఉస్మానియా యూనివర్శిటీ చౌరస్తా వద్ద చాయ్ బండి నిర్వహిస్తున్న వినోద్ అనే యువకుడితో మోడీతో ముఖాముఖి మాట్లాడే అవకాశం దక్కింది. బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా వినోద్‌తో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, మోడీ అభిమానులు ఎదురుచూశారు.
కానీ చివరకు సమయం మించి పోవటంతో నరేంద్రమోడీ.. వినోద్‌తో మాట్లాడేందుకు ఆన్‌లైన్‌లోకి రాకపోవటం కొంత నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ చివరి క్షణంలో మోడీ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తాను చేపట్టిన ముఖాముఖి కార్యక్రమంలో అందరితో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నానని, రాబోయే రోజుల్లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు. వినోద్ మాట్లాడుతూ.. మోడీ చివరగా చెప్పిన మాటలు తనకు సంతోషాన్ని కలిగించాయన్నారు.
తనతో మాట్లాడకున్నా మిగతా చాయ్‌వాలాలతో మాట్లాడటం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనేక ప్రాంతీయ, జాతీయ ఛానెళ్లు దాదాపు మూడు గంటల పాటు ఎన్‌సీసీ చౌరస్తాలో నిరీక్షించి హడావుడి చేశాయి. కాగా,మోడీ చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని తిలకించేందుకు అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఓయూ గేటు వద్దకు తరలివచ్చారు.