
ఐటీ కారిడార్‌కు మరిన్ని బస్సులు
సాక్షి,సిటీబ్యూరో: ఐటీ కారిడార్ బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అభయ ఉదంతం నేపథ్యంలో నగరంలోని వివిధ మార్గాల నుంచి ఐటీ కారిడార్‌కు ఆర్టీసీ 40 బస్సులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కొండాపూర్, వీబీఐటీ, వేవ్‌రాక్, ఫైనాన్షియల్ సిటీ, మణికొండ,మాధాపూర్ సాఫ్ట్‌వేర్ లేఅవుట్,తదితర ప్రాంతాల్లోని సుమారు 600 ఐటీ కంపెనీల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు సాఫ్ట్‌వేర్ నిపుణుల కోసం నెల క్రితం ప్రారంభించిన ఈ బస్సులు క్రమంగా ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. బాచుపల్లి-వేవ్‌రాక్, లింగంపల్లి- వేవ్‌రాక్, మెహదీపట్నం-క్యూసిటీ, మైత్రీవనం- వేవ్‌రాక్ మార్గాల్లో ఈ బస్సులు రోజు 200 ట్రిప్పులు తిరుగుతున్నాయి.
25 వేల నుంచి 35 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. బస్సులను ప్రవేశపెట్టిన మొదటి రెండు, మూడు వారాల్లో పెద్దగా ఆదరణ కనిపించకపోయినా, క్రమంగా పెరిగిందని, ప్రస్తుతం వేవ్‌రాక్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ కోటేశ్వర్‌రావు ‘సాక్షి’తో చెప్పారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 11.30 వరకు అందుబాటులో ఉండేవిధంగా బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.
ఇక భయం లేదు
ఆర్టీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బస్సులు మహిళా ప్రయాణికుల భద్రతకు భరోసానిస్తున్నాయి. అప్పటి వరకు ట్యాక్సీల్లో, షేరింగ్ ఆటోల్లో ప్రయాణిం చిన వాళ్లు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూ స్తున్నారు. మరోవైపు ఐటీ కంపెనీల యాజమాన్యాలతో పోలీసులు, ఆర్టీసీ అధికారులు తరచుగా నిర్వహిస్తోన్న సమావేశాలు కూడా ఫలితాన్నిస్తున్నాయి. ఐటీ క ంపెనీలు తమ స్థలాల్లో బస్సులను ఆపేందుకు అవకాశం ఇ వ్వడంతో ప్రస్తుతం పార్కింగ్ ఇబ్బందీ తొలగిపోయిం ది. ఈ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 49 నుంచి 58 శాతం వరకు నమోదవుతోంది. సాధారణ బస్సుల్లో కిలోమీటర్‌కు రూ.37.80 చొప్పున ఆదాయం లభిస్తుండగా, ఐటీ బస్సుల్లో ప్రస్తుతం రూ.30 వరకు వస్తోంది. సురక్షితమైన, మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని అందజేస్తోన్న ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సంస్థ ఈడీ కోరుతున్నారు.
త్వరలో సికింద్రాబాద్-వేవ్‌రాక్
సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం వీబీఐటీ వరకు నడుస్తున్న బస్సులను వేవ్‌రాక్ వరకు పొడిగించనున్నారు. కొత్తగా మరో 8 బస్సులు ఈ మార్గంలో నడపనున్నట్లు ఈడీ తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకే ఈ రూట్లో బస్సుల సంఖ్యను పెంచుతున్నామని, ఒకటి, రెండు రోజుల్లో ప్రయాణికులకు ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు.