6 వేలకు పైగా పాఠశాలల్లో టీఎస్-క్లాస్
కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు
- రెండు నెలల్లో అమలు.. రూ. 60 కోట్లతో పరికరాలు
- కేజీబీవీ, మోడల్‌స్కూళ్లు, గురుకులాల్లోనూ అమలు
- డిప్యూటీ సీఎం సమీక్షలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 6,236 ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతుల బోధనను అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండు నెలల్లోగా డిజిటల్ బోధనను ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ కంప్యూటర్ లిటరసీ అండ్ స్కిల్స్ ఇన్ స్కూల్స్ (టీఎస్-క్లాస్) పేరుతో దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6, 7, 8, 9 తరగతుల్లో మొదట దీనిని అమలు చేస్తారు.
ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అయ్యే సమయం వచ్చినందున టెన్త్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1,516 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2,680 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నింటిని రూ. 6 కోట్లు వెచ్చించి రిపేర్ చేయించి వినియోగంలోకి తేవడంతోపాటు అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు.
నోడల్ ఏజెన్సీగా ఐటీ శాఖ
ప్రస్తుతం రాష్ట్రంలో 391 కేజీబీవీలు, 187 మోడల్ స్కూళ్లు, 5,144 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికితోడు 247 గిరిజన సంక్షేమ గురుకులాలు, 129 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 47 తెలంగాణ ప్రభుత్వ గురుకులాలు, 20 బీసీ సంక్షేమ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా 6,236 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులను అమల్లోకి తీసుకురానున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ. 70 వేలు వెచ్చించి మొత్తంగా రూ. 60 కోట్లతో డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి స్కూల్‌కు ప్రొజెక్టర్, స్క్రీన్, స్పీకర్లు, డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేస్తారు. ఒక్కో స్కూలులో 10 కంప్యూటర్లు ఉండేలా చర్యలు చేపడతారు. తెలంగాణ ఐటీ శాఖ ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ఇప్పటికే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (సైట్), యునిసెఫ్ తరగతుల వారీగా రూపొందిం చిన డిజిటల్ కంటెంటు ద్వారా బోధన నిర్వహిస్తారు. అలాగే గణితం పాఠాలు 100 శాతం, బయాలజీ 97 శాతం, ఫిజిక్స్ 95 శాతం, సోషల్ సబ్జెక్టు పాఠాలు 35 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఇక రెండో దశలో ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు అన్ని రకాల విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్, విద్యాశాఖ కమిషనర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.