'జీహెచ్‌ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి' | 'My wife died due to the negligence of GHMC authorities' | Sakshi
Sakshi News home page

'జీహెచ్‌ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భార్య మృతి'

Published Thu, Nov 13 2014 7:20 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

జీహెచ్ ఎంసీ వద్ద ధర్నా చేస్తున్న మృతురాలు సత్యవాణి భర్త, బంధువులు - Sakshi

జీహెచ్ ఎంసీ వద్ద ధర్నా చేస్తున్న మృతురాలు సత్యవాణి భర్త, బంధువులు

హైదరాబాద్: సికింద్రాబాద్‌ ఉప్పల్‌ బస్టాప్‌ వద్ద బుధవారం రాత్రి  నాలాలో పడి గర్భిణి సత్యవాణి మృతి చెందడానికి జీహెచ్‌ఎంసి అధికారుల నిర్లక్ష్యమే కారణమా?  సికింద్రాబాద్‌ ఉప్పల్‌ బస్టాప్‌ వద్ద నాలాను ఎందుకు మూసివేయలేదు? గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదు?  ఈ ఘటనలో  జీహెచ్‌ఎంసి అధికారుల నిర్లక్ష్యమే తన భార్య  సత్యవాణి మృతికి కారణమని ఆమె భర్త ప్రేమ్‌రాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా ఈపూరు మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం అలియాబాద్‌కు వచ్చారు. భాస్కర్, లక్ష్మి దంపతుల కూతురు సత్యవాణికి ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది.  ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

బుధవారం రాత్రి సత్యవాణి తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వెళ్లేందుకు ఉప్పల్ బస్టాండ్ వద్దకు వచ్చింది. అయితే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.  నాలాలో పడి కొట్టుకుపోయింది. ఆ తర్వాత మృతదేహాన్ని బయటకుతీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు.  

బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు తన భార్య నాలాలో పడితే  జీహెచ్‌ఎంసి రెస్క్యూ టీం ఎనిమిదిన్నర గంటల తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారని సత్యవాణి భర్త అవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భార్య మృతికి  జీహెచ్‌ఎంసి అధికారులదే పూర్తి బాధ్యత అని అంటున్నారు. సత్యవాణి మృతి చెంది 15 గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి, రెవిన్యూ అధికారులు స్పందించలేదన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులపై స్థానిక గోపాలపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ప్రేమ్‌రాజ్‌ చెప్పారు.

సత్యవాణి మృతికి కారణమైన ఉప్పల్‌ బస్టాండ్ వద్ద నాలాను సంవత్సరం క్రితం నిర్మించారు. నాలా నిర్మిస్తున్న సమయంలో అది కూలిపోవడంతో స్ధానికులు అప్పుడే  జీహెచ్‌ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  అధికారులు లంచాలకు అలవాటుపడి ప్రజల రక్షణను గాలికి వదిలేస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ గాంధీ ఆస్పత్రి ఆవరణలో బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు స్పందించి ఓపెన్‌ నాలాలు మూసివేయడంతో పాటు గర్భిణి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

ఇదిలా ఉండగా, నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన సత్యవాణి కుటుంబానికి జీహెచ్ఎంసి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement