
హరీశ్‌ది దాటవేత ధోరణి: నాగం
రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అక్రమాలపై తాను మొత్తం ఆధారాలను సమర్పిస్తే వాటిపై మంత్రి హరీశ్‌రావు దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అక్రమాలపై తాను మొత్తం ఆధారాలను సమర్పిస్తే వాటిపై మంత్రి హరీశ్‌రావు దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. తాను ప్రాజెక్టులను శిఖండిలా అడ్డుకుంటున్నానంటూ హరీశ్‌రావు ప్రతి విమర్శలు చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతిని అడ్డుకునే వారంతా శిఖండులని అనుకుంటే దానిని తాను గర్వంగా స్వీకరిస్తానన్నారు. పారదర్శకంగా టెండర్ల విధానం అమలుచేస్తున్నట్లు హరీశ్ చెబుతున్నారని, అయితే ఈ టెండర్లలోనే అవినీతి, దోపిడీ ఉందని తాను డాక్యుమెంట్లతో సహా వెల్లడిస్తున్నానన్నారు.
తాను లేవనెత్తుతున్న అంశాలతో హరీశ్‌కు ఏసీ గదిలోనే చెమటలు పడుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ధైర్యముంటే ప్రాజెక్టులపై తాను హైకోర్టులో వేసిన కేసులను త్వరగా చేపట్టాలని కోర్టుకు లేఖ రాసి విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని హరీశ్ ఎద్దేవా చేయడం చూస్తుంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అందులో చేరేందుకు హరీశ్ సంప్రదింపులు జరపలేదా అని నాగం ప్రశ్నించారు.