మంత్రి జూపల్లితో నమ్రత శిరోద్కర్ భేటీ
హైదరాబాద్ : హీరో మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోమవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామ అభివృద్ధిపై ఆమె ఈ సందర్భంగా మంత్రిలో భేటీ అయ్యారు. మహేశ్ బాబు సిద్దాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి కూడా పాల్గొన్నారు. సిద్దాపూర్ అభివృద్ధికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఆరోగ్యం, పరిశుభ్రత, స్కూల్ అభివృద్ధిపై నమత్ర ఆసక్తి చూపినట్లు చెప్పారు.
మరోవైపు మంత్రితో భేటీ అనంతరం నమ్రత మాట్లాడుతూ సిద్దాపూర్ను స్మార్ట్ విలేజ్గా మార్చుతామని తెలిపారు. సిద్దాపూర్ గ్రామ అభివృద్ద్ధికి సమగ్ర ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు వివరించారు. కాగా కొద్దిరోజుల క్రితం ఆమె సిద్దాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచ్ నర్సమ్మ నమత్ర శిరోద్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలపై నమ్రతకు ఓ వినతిపత్రం సమర్పించారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోనూ మహేష్ బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మహేష్ తండ్రి కృష్ణ సొంతూరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని, అక్కడ ఇటీవలే ప్రిన్స్ పర్యటించాడు. సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం అన్న సందేశాన్ని చాటిన 'శ్రీమంతుడు' సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాడు.