ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం మధ్యాహ్నమే అవడం హర్షించదగ్గ విషయమని నాయిని అన్నారు.
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం లోపే అవడం హర్షించదగ్గ విషయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఏరియల్ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ వ్యూ ద్వారా చార్మినార్, ట్యాంక్‌బండ్‌లలో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ... నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
సహకరించిన గణేష్ ఉత్సవ సమితికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఇతర వినాయక విగ్రహాలు రాత్రి లోపే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీకి అదేశించామని తెలిపారు. ప్రజలు కూడా స్వచ్చందంగా, వీలైనంత త్వరగా రాత్రి లోపే నిమజ్జనాన్ని ముగించాలని కోరుతున్నామన్నారు. పోలీసులు రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని శ్రమించారన్నారు. పోలీస్ శాఖ పనితీరు చాలా బాగుందని, జీహెచ్‌ఎంసీ అధికారులు, హెచ్‌ఎండీఏ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని ప్రశంసించారు.