సాక్షి, సిటీబ్యూరో: ‘వెపన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ’... పోలీసు శిక్షణలో... అందులోనూ భద్రత అధికారులుగా విధులు నిర్వర్తించే వారికి పదే పదే చెప్పే అంశమిది. ప్రముఖుల భద్రతకు జారీ చేసే ఆయుధాన్ని శరీరంలో ఓ భాగంగా పరిగణించాలన్నది దీని ఉద్దేశం. ప్రజాప్రతినిధులతో పాటు కీలక వ్యక్తుల వెంట ఉండే గన్‌మెన్ ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఆయుధాన్ని ఇష్టం వచ్చినట్లు ప్రదర్శించడం... ఎక్కడపడితే అక్కడ పెట్టి వెళ్లిపోవడం... సాధారణ వ్యక్తులకు ఇవ్వడం సర్వ సాధారణ విషయంగా మారిపోయింది.
మంగళవారం నారాయణగూడ ఠాణా పరిధిలో డ్రైవర్ అక్బర్ ప్రాణాలు తీసిందీ గన్‌మెన్ రవీందర్ నిర్లక్ష్యమే. గన్‌మెన్‌కు ప్రతి నెలా నిర్వహించే రిఫ్రెషర్ కోర్సుల్లోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటిస్తున్నా... పట్టించుకునే దాఖలాలే లేవు. గన్‌మెన్ నిర్లక్ష్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా... పట్టించుకునే పరిస్థితి ఉన్నతాధికారులకు లేదు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పిలిచే గన్‌మెన్ నిబంధనల ప్రకారం ఆయుధ నిర్వహణలో ఎలా చేయాలంటే...
* పోలీసులు, గన్‌మెన్‌కు ఇచ్చే శిక్షణలో వెపన్ హ్యాండ్లింగ్ అనేది ఓ ప్రధానమైన సబ్జెక్ట్.
* విధుల్లోకి వచ్చే ముందు వారి కార్యాలయాల్లో ఉండే బెల్ ఆర్మ్స్ నుంచి ఆయుధంతో పాటు తూటాలను తీసుకుంటారు.
* ప్రతి పీఎస్‌ఓ 24 గంటల పాటు విధుల్లో ఉంటే... మరో 24 గంటల పాటు ఆఫ్ తీసుకుంటారు.
* ఈ నేపథ్యంలోనే 24 గంటలూ తనకు కేటాయించిన ఆయుధాన్ని కచ్చితంగా శరీర భాగంగానే భావిస్తూ దగ్గర ఉంచుకోవాల్సిందే.
* దీన్ని రిలీవర్‌కు లేదా అత్యవసరమైతే ఆయా ప్రాంతాల్లో ఉండే గార్డ్స్‌కు మాత్రమే ఇచ్చి, మళ్లీ తీసుకోవాలి.
* మిషన్ గన్లు, ఏకేలు, కార్బైన్లు మినహా సార్ట్ వెపన్స్‌గా పిలిచే రివాల్వర్, పిస్టల్‌ను గన్‌మెన్ బయటకు కనిపించే విధంగా ధరించకూడదు.
* దాన్ని కచ్చితంగా సేఫ్టీ మోడ్‌లో పౌచ్‌లో పెట్టి దుస్తులకు లోపలి భాగంలోనే భద్రపరుచుకోవాలి.
* విధుల్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ ఆయుధాన్ని శరీరం నుంచి తీసి విడిగా ఎక్కడా పెట్టకూడదు.
* ఆయుధాన్ని ఎవరికైనా (అధికారిక వ్యక్తులు) ఇచ్చేటప్పుడు, బెల్ ఆఫ్ ఆర్మ్‌లో డిపాజిట్ చేసేప్పుడు కచ్చితంగా తూటాలు ఉండే మ్యాగజైన్‌ను బయటకు తీయాలి.
* చాంబర్‌లోకి తూటా లోడ్ అయిందో లేదో పరిశీలించడానికి ఒకటి, రెండుసార్లు పైన ఉండే స్లైడర్‌ను కాగ్ చేయాలి.
* ఇలా చేస్తే చాంబర్‌లోడ్‌లో తూటా ఉంటే ఇంజెక్షన్ పోర్ట్ నుంచి బయటకు పడిపోతుంది.
* కాగ్ చేసిన తర్వాత కూడా నేల వైపు గురిపెట్టి రెండు మూడుసార్లు ట్రిగ్గర్‌ను నొక్కినతర్వాతే ఎదుటి వారికి అప్పగించాలి.
* ఆయుధాన్ని ఎదుటి వ్యక్తులకు (అధికారిక) ఇస్తున్నప్పుడు కచ్చితంగా తూటా బయటకు వచ్చే బ్యారెల్ భాగం తన వైపే ఉండేలా చూడాలి.
ఏం జరిగిందంటే..?
1. పీఎస్‌ఓ రవీందర్ వద్ద ఉన్న పిస్టల్‌ను వెంకట్ పరిశీలిస్తున్న క్రమంలో సేఫ్టీ లివర్ రిలీజ్ కావడంతో పాటు మ్యాగజైన్‌లో ఉండే తూటాల్లో ఒకటి చాంబర్‌లోకి వెళ్లిపోయింది. పిస్టల్ మ్యాగజైన్ కెపాసిటీ 12 రౌండ్లు (తూటాలు) కాగా... స్ప్రింగ్ మూవ్‌మెంట్ కోసం 10 లేదా 11 మాత్రమే పెడుతుంటారు.
2. ఈ ఆయుధాన్ని తీసుకున్న అక్బర్ పిస్టల్ పైభాగంలో ఉండే స్లైడర్‌ను లాగడానికి యత్నించాడు.
3. దీంతో కంగారుపడిన రవీందర్ ఆయుధాన్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పిస్టల్ రవీందర్ చేతుల్లోకి వస్తుండగానే.. అతడి వేలు పొరపాటున ట్రిగ్గర్‌పై పడింది.
4. ఈ పరిణామంతో తుపాకీ వెనుక ఉండే హ్యామర్ ఫైరింగ్ పిన్‌ను ప్రేరేపించడంతో తూటా పేలి బ్యారెల్ నుంచి దూసుకుపోయింది.
5. అక్బర్ ఛాతీలోకి దూసుకుపోయిన తూటా వీపు భాగం నుంచి బయటకు వచ్చి... గోడను తాకి కింద పడింది.
* ఆయుధం.. శరీరంలో భాగం
* శిక్షణలో పదే పదే చెప్పే అంశమిది
* అయినా నిత్యం గన్‌మెన్ నిర్లక్ష్యం
* పట్టించుకోని అధికారులు
సంఘటన స్థలంలో దృశ్యమిదీ..
1. గోడను బుల్లెట్ తాకిన ప్రాంతం
2. పేలిన పిస్టల్
3. అక్బర్‌కు గాయమైన ప్రాంతం
4. పిస్టల్ పేలిన సందర్భంలో రవీందర్ కూర్చున్న ప్రాంతం
భద్రత గ‘గన్’మే!
Published Wed, Feb 17 2016 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM
Advertisement
Advertisement