‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’
హైదరాబాద్ : నగరంలోని బోడుప్పల్లో 17 ఏళ్ల సాహితి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ఆస్తి కోసం మేనత్త, మేనమామ హత్య చేశారని సాహితి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన సాహితి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతో కలిసి ఉంటోంది.
అయితే మేనమామ నివాసానికి వచ్చిన సాహితి గతరాత్రి బాత్రూమ్లో జారిపడి మృతి చెందినట్లు ఆమె మేనత్త చెప్పటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మరో పదిరోజుల్లో సాహితికి మైనార్టీ తీరునున్న నేపథ్యంలో ఆస్తి కోసమే హతమార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.