రాయదుర్గం : గణేష విగ్రహాల నిమజ్జనానికి రాయదుర్గంలోని మల్కంచెరువు వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టిన కోనేరు సిద్ధమైంది. రూ.67 లక్షలతో గణేష నిమజ్జన కోనేరును నిర్మించారు. కోనేరు నిర్మాణం పూర్తి కావడంతో నిమజ్జనానికి బుధవారం మధ్యాహ్నం నుంచి తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రధానంగా గచ్చిబౌలి డివిజన్ లోని రాయదుర్గం, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, మధురానగర్, గోపన్ పల్లి, గౌలిదొడ్డి, టెలికామ్నగర్, జీపీఆర్‌ఏ క్వార్టర్స్, గచ్చిబౌలి, అంజయ్యనగర్, వినాయకనగర్, ఓయూకాలనీ వంటి ప్రాంతాలలోని వినాయకవిగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 8 ఫీట్ల పొడవు ఉన్న వినాయక విగ్రహాలను ఇందులో నిమజ్జనం చేయవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోనేరు నిర్మాణ పనులను గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టిసాయిబాబా, జీహెచ్‌ఎంసీ నీటిపారుదల విభాగం ఎస్‌ఈ శేఖర్‌రెడ్డి పరిశీలించారు.
కోనేరుకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా....
మల్కంచెరువు వద్ద నిర్మాణం చేసిన గణేశ నిమజ్జన కోనేరుకు చెరువులోని నీటి రంగు మారడం, దుర్వాసన వెదజల్లుతుండడంతో ఆ నీటిని వాడొద్దని నిర్ణయించారు. కోనేరులో నీటిని నింపేందుకు సమీపంలోని బోర్ల ద్వారా ట్యాంకర్లతో నీటిని నింపాలని భావిస్తున్నారు. ఈ ఏర్పాట్లను బుధవారం ఉదయం నుంచి చేయాలని నిర్ణయించారు. అవసరమైతే చెరువు వద్ద కొత్తగా బోరును వేయాలని, కోనేరును శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడంతో వీధి దీపాలు, బోరు వేస్లే అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.
కోనేరు చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం చేయాలి...
మల్కంచెరువు వద్ద నిర్మాణం చేసిన కోనేరు చుట్టూరా సీసీ రోడ్డు వేయాలని స్థానికులు, గణేశ ఉత్సవ సమితి ప్రతినిధులు కోరుతున్నారు. మంగళవారం చిన్న వాహనం ఒకటి కోనేరు నిర్మాణానికి అవసరమైన పనిముట్లు తీసుకొచ్చి మట్టిలో దిగబడిపోయింది. దీంతో పది మంది కార్మికులు కష్టపడి దాన్ని బయటకి తీయాల్సి వచ్చింది. ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
రాయదుర్గంలో నిమజ్జన కోనేరు సిద్ధం
Published Tue, Sep 6 2016 8:28 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement