
ఏపీ మంత్రి నారాయణ కుమారుడి మృతి
హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణతో పాటు మరోవ్యక్తి మృతిచెందారు. స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి నిశిత్ బెంజ్ కారులో వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో వీరి వాహనం మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిశిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవివర్మ మృతిచెందాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న నిశిత్ అక్కడికక్కడే మృతిచెందగా, రవివర్మను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
నిశిత్, రవివర్మ మృతదేహాలను అపోలో ఆస్పత్రికి తరలించారు. విషాదవార్త విన్న మంత్రి నారాయణ బంధువులు అపోలోకు చేరుకుంటున్నారు. నిశిత్ ప్రయాణించిన బెంజ్ కారు నెంబర్ టీఎస్ 07 ఎఫ్‌కే 7117 అని సమాచారం. ఈ ఏడాదే నారాయణ గ్రూప్స్ డైరెక్టర్‌గా నిశిత్ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు నిశిత్ తండ్రి ఏపీ మంత్రి నారాయణ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ మృతిపట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మంత్రి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.