పార్టీ ఫిరాయింపులు అనైతికం
కబ్జాలు, కాలేజీలను కాపాడుకోవడానికే అజయ్ ఫిరాయిస్తున్నారు: పీసీసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు అనైతిక రాజకీయాలకు పరాకాష్ట అని పీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పక్షం రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులను పట్టించుకోకుండా ఫిరాయింపులపైనే దృష్టి పెట్టిందన్నారు. గ్రామా ల్లో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పనులు దొరక్క పేదలు వలసలు పోతున్నారని, అయినా సీఎం కేసీ ఆర్, మంత్రులు పట్టించుకోవడం లేద న్నారు. టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బెదిరించి, బతిమిలాడి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.
స్వార్థం కోసమే: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కేవలం స్వార్థ ప్రయోజనాలకోసమే టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయిస్తున్నారని కోదండరెడ్డి, నిరంజన్‌లు ఆరోపించారు. అజయ్ పార్టీలోకి వచ్చి రెండేళ్లు కాకున్నా సీఎల్పీ కోశాధికారి పదవి, పార్టీ సీనియర్లతో ఏర్పాటుచేసిన కార్యనిర్వాహక కమిటీలో చోటు దక్కిందన్నారు. పాలేరు ఉప ఎన్నికకు ముందు అజయ్ పార్టీ మార డం స్వార్థం, మోసాలకు పరాకాష్ట అని అన్నారు. వ్యాపారాలను, కాలేజీలను, కబ్జాలను కాపాడుకోవడానికే అజయ్ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో దశాబ్దాలు పనిచేసిన వారిని కాదని టికెట్ ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీపై తప్పుడు వ్యాఖ్యలు మానుకోవాలన్నారు.