శుభమే జరిగేట్టు శ్రద్ధ వహిద్దాం!
ఏ వ్యక్తికైనా కావాల్సింది ఏమిటి? ఏం ఉన్నా, ఏం లేకపోయినా ఒక వ్యక్తికి ప్రధానంగా ఉండాల్సింది ఏమిటి? ఎలాంటి వ్యక్తి ఐనా, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఐనా పొందాల్సింది ఏమిటి? ఎవరి ఆశలు వారివి. ఎవరి ఆకాంక్షలు వారివి. ఎవరి ఆశయాలు వారివి. మన అందరికీ అందాల్సిన వాటిల్లో ఏది అగ్రగణ్యమైంది? ఏది మనల్ని ఎప్పటికీ వీడిపోకుండా ఉండాలి? శుభం... శుభం... శుభం...
‘అథాతో బ్రహ్మ జిజ్ఞాస‘ అని బ్రహ్మ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం తెలియజెప్పింది. అంటే శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస అని అర్థం. ఆధ్యాత్మిక పరమైన బ్రహ్మం గురించిన జిజ్ఞాస ఎందుకు అంటే అది శుభం కాబట్టి. లౌకిక జీవనానికైనా, ఆధ్యాత్మిక జీవనానికైనా శుభమే మనిషికి లక్ష్యం; ఆ లక్ష్యానికి మనిషి లక్షణం. లక్ష్య, లక్షణ సమన్వితం జరగాలి. అంటే మనిషికి శుభం సమన్వితం అవ్వాలి.
క్షేమం, మంగళం, మేలు, సౌఖ్యం ఇవి అన్నీ శుభం ఔతాయి. శుభం మనకు నిండుగా ఉండాలి. మనకు శుభం కలగడానికి, మనం శుభంతో మెలగడానికి మనకు మనమే ఆధారం. కనుక మనంత మనమై శుభం కోసం ప్రయత్నం చేసుకోవాలి.
ప్రయత్నం వల్ల ప్రయోజనం ఉంటుంది. మనం శుభం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి; మన ప్రయత్నాలకు ఫలితంగా మనం శుభాన్ని పొందుతూ ఉండాలి. శుభాలు ప్రభవించాలని ఎప్పుడైనా అకాంక్షించవచ్చు;
ప్రభవించిన శుభాలు విభవాన్నివ్వాలని ఎవరైనా ఆశించవచ్చు. కానీ ఇంత వరకూ ఆ పని సరిగ్గా జరగలేదు. ఎవరూ ఆ పనిని సరిగ్గా చేసేందుకు ముందుకు రాలేదు. మనం శుభం కోసం పని చెయ్యాలి. మన కోసం శుభం పంట పండాలి. ఇకపైనైనా మనం శుభం కోసం పని చేద్దాం; ఇక అంతా శుభమయం కావడానికి మనల్ని మనం సరిచేసుకుందాం. ఆశపడి, ఆకాంక్షించి, ఆశించి మనం శుభాన్ని సాధించుకుందాం.
కుత్సతం, మత్సరం, దాష్టీకం, దుర్మార్గం, ద్రోహం, వైరం, అసూయ, అక్కసు, బద్ధకం, నీరసం, అభిప్రాయాలు, మనో భావాలు, నమ్మకాలు, అపనమ్మకాలు, అపార్థాలు, అవిద్య, మూర్ఖత్వం, దుశ్చింతన, బుద్ధిమాంద్యం ఇవన్నీ శుభాన్ని మనకు లేకుండా చేశాయి. వీటిని మనం వెనువెంటనే వదిలించేసుకోవాలి. మన చెడు నడతను మనం మార్చుకోవాలి; మనం మనస్తత్త్వంలో మానవత్వాన్ని చేర్చుకోవాలి; మనం మస్తిష్కంలో మంచితనాన్ని కూర్చుకోవాలి.
శుభం కోసం మనం ఇకపై సవ్యంగా ఉండాలి. మనమే కాదు, మన పెద్దలు చేసిన తప్పులూ మనకు శుభాన్ని లేకుండా చేస్తున్నాయి; అవి మన సమాజంలో అశుభాన్ని రగిలిస్తున్నాయి; ఎప్పుడో ఎవరో చేసిన కుట్రలు ఇప్పటికీ శుభాన్ని రానివ్వకుండా ఇలాతలాన్ని ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ఈ స్థితిని సరిదిద్దుకుందాం; రానున్న ఆపదల్ని తొలగించుకుందాం; శుభాన్ని ఆవాహన చేసుకుని అందుకుందాం.
‘శుభం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు తెలియజెప్పాక ‘సుఖ విశిష్టాభిధానాదేవ చ’ అని మరో బ్రహ్మసూత్రం మనకు ఉండాల్సిన తెలివిడిని ఇస్తూ ఉంది. విశిష్టమైన సుఖం ఇస్తుందని నిశ్చయంగా చెప్పబడినందువల్లే అది బ్రహ్మం అని ఆ సూత్రానికి అర్థం. సుఖం లేదా శుభం విశిష్టమైంది అన్న సత్యాన్ని మనం ఆకళింపు చేసుకోవాలి. ఆ విశిష్టమైన శుభాన్ని మనం పొందుతున్నామా? ఈ ప్రశ్నను మనకు మనమే వేసుకుని సరైన జవాబుగా మనం శుభాన్ని పొందాలి; పొందుదాం. సర్వత్రా శుభం నెలకొనాలి;సర్వులకూ శుభం వెల్లివిరియాలి.శుభం భూయాత్.
ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు వీటివల్ల శుభం కలుగుతుంది, జరుగుతుంది అని మనం మన మనసు, మెదడులతో తెలుసుకోవాలి. మన ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల వల్ల శుభం మాత్రమే జరిగేట్టు మనం శ్రద్ధ వహించాలి. శుభం కోసం మనం పూనుకోవాలి; శుభంతో మనల్ని మనం పునర్నిర్మించుకోవాలి
– రోచిష్మాన్