ఇతర పార్టీలవారిపై దాడులు సరికాదు: సీపీఎం
ఢిల్లీ ఘటనపై సీపీఎం నేతల నిరసన
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం చేతకాని మోదీ ప్రభుత్వం ఇతర పార్టీల వారిపై తమ కార్యకర్తలతో భౌతిక దాడులు చేయించడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు, దౌర్జన్యాలకు దిగడం సమాజానికే నష్టమని, వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలని కోరారు. దళిత, గిరిజన, మైనారిటీ, మహిళా హక్కులపై వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమించడాన్ని జీర్ణించుకోలేక హిందూ మతోన్మాదశక్తులు ఈ తరహాదాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
ఆదివారం ఢిల్లీలో సీపీఎం కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజాస్వామ్య, సామాజికశక్తులపై దాడిగా ఆయన అభివర్ణించారు. దీనిని నిరసిస్తూ సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మోదీ సర్కారు దిష్టిబొమ్మను ద హనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జి.నాగయ్య, డీజీ నరసింహారావు, టి.జ్యోతి, జె.వెంకటేశ్, ఎం.శ్రీనివాస్, బి.చంద్రారెడ్డి, బి.హైమావతి, జాన్‌వెస్లీ పాల్గొన్నారు.