అనుమతుల పెండింగ్ అంశం కేంద్రం దృష్టికి..
సంబంధిత ఫైళ్లకు తక్షణంక్లియరెన్స్ పొందడమే లక్ష్యం
ముంపు గ్రామాల పరిస్థితి, జాతీయ హోదాపై మరింత స్పష్టత కోసం...
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై మరింత స్పష్టత కోసం దేశరాజధాని ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక అధికారుల బృందం సిద్ధమైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టు ముంపు గ్రామాలు, మండలాలు, జాతీయ హోదా వంటి విషయాలపై ఒక అంచనాకు రావడానికి వీలుగా ఈ బృందం ఢిల్లీ పర్యటనకు వెళుతోంది. ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ బృందం శనివారం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించింది.
రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ముంపు ప్రాంతంపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తి, ప్రాజెక్టు పనులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు వీలుగా సదరు గ్రామాలను సీమాంధ్రలో కలపడానికి వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే జాతీయ హోదా కింద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్రం ఇంతకు ముందే ప్రకటించింది. అందుకు అవసరమైన అన్ని రకాల అనుమతులను కూడా పొందుతామని పేర్కొంది.
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంకా కొన్ని తుది అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించి తుది క్లియరెన్స్‌లను పొందాల్సి ఉంది. పక్క ఉన్న ఒరిస్సా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడంతో ఈ అనుమతులను పెండింగ్‌లో ఉంచారు.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆయా శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్రం దృష్టికి తీసుకురావాలని రాష్ట్రానికి చెందిన అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఇరిగేషన్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు.
ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి అటవీ, పర్యావరణ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే క్లియర్ అయ్యే విధంగా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అధికారులు ఢిల్లీకి వెళుతున్నారు.
రాష్ట్ర పర్యటనకు బాబ్లీ అధికారులు !
బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్రానికి చెందిన అధికారులు రాష్ర్టంలో పర్యటించారు. ఈ ప్రాజెక్టుకు ఇంతకు ముందే సుప్రీం కోర్టు అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల కమిటీ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనుంది. వచ్చే సీజన్ నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించనుంది. అందులో భాగంగా మహారాష్ట్రకు చెందిన ఇంజనీర్లు మన రాష్ర్ట అధికారులతో చర్చలు జరిపారు.
పోలవరంపై ఢిల్లీకి అధికారులు!
Published Sat, Mar 1 2014 2:08 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement