
కొత్త జిల్లాలపై క్షేత్రస్థాయి సర్వే
⇒ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
⇒ ప్రశ్నావళి సిద్ధం చేసిన సీఎం కార్యాలయం
⇒ ఆందోళనలు, అభ్యంతరాలపై లోతుగా ఆరా
⇒ నిఘాతోపాటు పలురకాలుగా సమాచార సేకరణ
⇒ నివేదికల ఆధారంగానే జిల్లాలపై తుది నిర్ణయం
⇒ అర లక్ష దాటిన ఆన్‌లైన్ అర్జీలు
సాక్షి, హైదరాబాద్
కొత్త జిల్లాలపై జరుగుతున్న ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా సర్వే చేయించాలని అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సీఎం కార్యాలయం ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించింది. నిఘా విభాగంతో పాటు మరో ఏజెన్సీ ద్వారా సర్వేకు సన్నాహాలు చేసింది. పలువర్గాల నుంచి సమాచారం సేకరించి క్షేత్రస్థాయిలో నిజానిజాలు రాబట్టాలని నిర్దేశించింది.
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మీ స్పందనేమిటి? మీ మండలం, డివిజన్, జిల్లా మార్పుపై మీ అభిప్రాయమేమిటి? ఏ పట్టణాన్ని కొత్త జిల్లా కేంద్రం చేయాలని కోరుతున్నారు, ఎందుకు? ప్రతిపాదిత జిల్లాలతో పాలనాపరంగా ఇబ్బందులేమైనా ఉన్నాయా? ప్రయోజనాలేమున్నాయి?’ తదితర ప్రశ్నలను సర్వేలో పొందుపరిచింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాలతో ముసాయిదాను ప్రకటించడం తెలిసిందే. వీటిలో 17 కొత్త జిల్లాలపై అభ్యంతరాలు వ్యక్తమవడమే గాక తమ పట్టణాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని, డివిజన్లు చేయాలని ఆందోళనలు మొదలయ్యాయి.
ప్రధానంగా వరంగల్‌లో హన్మకొండ జిల్లా ఏర్పాటుకు నిరసనగా ప్రజలు రోడ్డెక్కారు. అదే జిల్లాలో జనగామ, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షాల అధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కోరుట్లను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలని అక్కడి ప్రజలు పట్టుబడుతున్నారు. మహబూబ్‌నగర్‌లో వనపర్తి జిల్లాలో కలిపిన నాలుగు మండలాలపై ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఇవన్నీ ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న ఆందోళనలేనా, నాయకులు తెర వెనక ఉండి స్వప్రయోజనాల కోసం చేయిస్తున్నారా అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. సర్వే ద్వారా దీనిపైనా సమాచారం రాబట్టనుంది.
అర్జీల్లో అసలువెన్ని, నకిలీలెన్ని...
కొత్త జిల్లాలకు నిర్దేశించిన వెబ్‌సైట్‌లో అర లక్షకుపైగా అర్జీలు దాఖలయ్యాయి. దాదాపు అన్ని జిల్లాలు, డివిజన్లు, మండలాలపైనా ప్రజలు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు నమోదు చేశారు. అర్జీలు మంగళవారం నాటికి 53,665కు చేరాయి. వీటిని పరిశీలించిన సీఎం, నిజమైనవెన్ని.. ఉత్తుత్తివెన్నో తెలుసుకోవాలని అధికారులను పురమాయించారు. కొన్నింటిపై తప్పుడు పేర్లు, తప్పుడు చిరునామాలున్నట్లు గుర్తించారు. కొందరు అర్జీదారులకు ఫోన్ చేసి అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రధానంగా వనపర్తి, యాదాద్రి జిల్లాలపై ఎక్కువ ఫిర్యాదులు రావడంతో ఇవన్నీ అక్కడి రాజకీయ నేతలు ఉద్దేశపూర్వకంగా దాఖలు చేయించినవేనని ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే సర్వేలో భాగంగా క్షేత్రస్థాయికి వెళితే ఆన్‌లైన్ అర్జీల్లోని పస కూడా తేలిపోతుందని భావిస్తోంది.
అభ్యంతరాలకు మరో 8 రోజులు...
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై ప్రజలు తమ అభ్యంతరాలు నమోదు చేసేందుకు మరో ఎనిమిది రోజుల గడువు మిగిలింది. ప్రభుత్వం ఆగస్టు 22న కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ప్రచురించినందున ఈ నెల 21 వరకు అర్జీలు దాఖలు చేసుకునే వెసులుబాటుంది. ఆ తర్వాత వాటిని పరిశీలించి, కొన్ని మార్పుచేర్పులతో ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. అక్టోబరు 11న దసరా నాటి నుంచి కొత్త జిల్లాలను మనుగడలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నందున విజ్ఞప్తులన్నిటినీ ఈ నెలాఖర్లోగా పరిష్కరించి తొలి వారంలోనే తుది నోటిఫికేషన్ సిద్ధం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయించిన ముహూర్తం మేరకు దసరా రోజున ఉదయమే తుది నోటిఫికేషన్‌ను జారీ చేసి, అదే ముహూర్తంలో కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నారు.