ఓయూలో విద్యార్థుల ఆందోళన
రెండో పీజీ చేస్తున్న వారికీ వసతులు కల్పించాలని డిమాండ్
ప్రిన్సిపాల్‌పై దాడికి యత్నం.. పలువురి అరెస్టు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పీజీ పూర్తి చేసి అక్కడే రెండో పీజీ చేస్తున్న వారికి కూడా అందరిలాగే హాస్టల్, మెస్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు శుక్రవారం ఓయూ సైన్స్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గతంలో రెండో పీజీ చేసిన వారికీ అన్ని సౌకర్యాలు కల్పించిన వర్సిటీ యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై నెల రోజుల నుంచి ప్రిన్సిపాల్ చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ నర్సింహారావుపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన తలకు గాయం అయింది. ఈ ఘటనలో ఓయూ జేఏసీ నాయకులు మానవతారాయ్‌తో పాటు సుమారు 20 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ.. గతంలో చీఫ్ వార్డెన్‌గా పని చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్సింహారావుపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
దాడిని ఖండించిన 'ఔటా'
సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారావుపై విద్యార్థులు దాడి చేయడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) నాయకులు ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.