సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకంలోని వివిధ ప్యాకేజీల్లో మార్పులకు నీటి పారుదల శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్యాకేజీ-1, ప్యాకేజీ-16లకు సంబంధించి కొత్త డిజైన్లు, ప్రాథమ్యాలకు తగినట్లుగా మార్పులకు ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ మార్పులతో రూ.100 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. పాలమూరు ప్రాజెక్టులోని ఒకటో ప్యాకేజీలో స్టేజ్-1 పంపింగ్ స్టేషన్‌ను తొలుత భూ ఉపరితలంపై నిర్మించాలని నిర్ణయించారు.
అయితే దీని నిర్మాణ ప్రాంతం అటవీ భూమి పరిధిలోకి వస్తుండడంతో.. అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ప్రాజెక్టు నిర్మాణం జాప్యమయ్యే అవకాశం ఉండడంతో పంపింగ్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని మార్చాలని భావించారు. నిర్మాణ స్థలం మార్పు, పెరిగే వ్యయం, ఇతర సానుకూల, ప్రతికూలతలను అంచనా వేసేందుకు నీటి పారుదల శాఖ ఇంజనీర్లతో ప్రభుత్వం కమిటీని వేసింది. పంప్‌హౌజ్‌ను అదే స్థలంలో భూగర్భంలో నిర్మించాలని.. దీనిద్వారా అటవీ, భూసేకరణ సమస్య తప్పుతుందని పేర్కొంటూ ఆ కమిటీ తమ నివేదిక సమర్పించింది.
కానీ తుది నిర్ణయం తీసుకునే ముందు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం)తో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఎన్‌ఐఆర్‌ఎం కూడా కూడా ఓకే చెప్పడంతో భూగర్భ పంప్‌హౌజ్ నిర్మించేందుకు నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి కమిటీ మొగ్గు చూపింది. ఈ మార్పు కారణంగా ప్రాజెక్టుపై రూ.50 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశముంది.
ప్యాకేజీ-16 లోనూ..: ఇక రూ.3,250 కోట్ల అంచనాతో చేపట్టిన ప్యాకేజీ-16లో తొలుత ఓపెన్ చానల్, టన్నెల్‌లను ప్రతిపాదిస్తూ కాల్వల నిర్మాణానికి డిజైన్ రూపొందించారు. ఇందులో భూసేకరణ, రైల్వే క్రాసింగులు వంటి సమస్యలు నెలకొన్నాయి. దీంతో డిజైన్ మార్చాలని నిర్ణయించి అధ్యయనం చేయించారు. ఈ మేరకు ఓపెన్ చానల్ కాకుండా మొత్తంగా టన్నెల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మార్పులతో ప్రభుత్వంపై రూ.80 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.