
పెద్ద నోట్ల రద్దుతో ఏం సాధించారు?
తన సలహాతోనే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దాని వల్ల ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తన సలహాతోనే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దాని వల్ల ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే ఎదురయ్యే పర్యవసానాలను అసలు ఆయన ముందుగా అంచనా వేశారా? అన్నది చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంట చేతికొచ్చినా ఒక్క బస్తాను కూడా రైతులు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. చంద్రబాబు పారిశ్రామికవేత్తల మెప్పు కోసం పాకులాడుతున్నారన్నారు. టీడీపీలో సీనియర్ నేతలు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చూస్తున్నారని, వచ్చే ఏడాదిలో వారు క్యూ కట్టే అవకాశం ఉందని ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు అన్నారు.
నోట్ల రద్దుతో వ్యవసాయం కుదేలు: నాగిరెడ్డి
పెద్ద నోట్ల రద్దుతో ముందుగా కుదేలైంది వ్యవసాయ రంగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్ధాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన దయ్యబట్టారు.