'షూ'లో దాచినా అడ్డంగా దొరికిపోయారు
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్నా.... అక్రమంగా బంగారం తరలింపు మాత్రం ఆగటం లేదు. తాజాగా అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో భాగంగా థాయ్లాండ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు షూలో బంగారాన్ని దాచిన విషయం బయటపడింది. దాంతో నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా బంగారంపై ఆంక్షలు పెరగటంతో శంషాబాద్ విమానాశ్రయం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా చేసే వ్యాపారులకు హైదరాబాద్ ప్రధాన ద్వారంగా మారిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకుంటున్నారు.
గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 62 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దీనివిలువ మార్కెట్ లో రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జనవరి, ఫిబ్రవరి నెలలో భారీగానే బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద అత్యాధునిక పరికరాలు ద్వారా తనిఖీలు చేస్తున్నా కొందరు కనుగప్పి చాకచక్యంగా బంగారాన్ని తీసుకొస్తున్నారు.