నెలాఖర్లోగా పీసీసీ ప్రక్షాళన
గ్రేటర్, రంగారెడ్డి,నిజామాబాద్, ఖమ్మం డీసీసీలకు త్వరలో కొత్త అధ్యక్షులు
సాక్షి, హైదరాబాద్: మండలం నుంచి రాష్ట్ర స్థాయిదాకా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఈ నెలాఖరులోగా పునర్ వ్యవస్థీకరించాలని ఏఐసీసీ ఆదేశించింది. ఖాళీగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్, ఖమ్మంలకు నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. గ్రేటర్, రంగారెడ్డి అధ్యక్షులను రెండు మూడు రోజుల్లో ప్రకటించనుంది. పార్టీ కార్యక్రమా ల్లో చురుకుగా లేని మండల స్థాయి నేతల స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వాలని కూడా పీసీసీకి సూచించింది. ముఖ్యమైన అనుబంధ విభాగాలతో సహా ఖాళీగా ఉన్న మండలాల్లోనూ నూతన కమిటీలు వేయనున్నారు.
పీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం జరిగి ఏడాది దాటినా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటుచేయలేదు. భారీగా ఉన్న ప్రస్తుత సంఖ్యను కనీస స్థాయికి కుదించాలని ఏఐసీసీ సూచించింది. దాదాపు 100 మంది పీసీసీ కార్యదర్శులుండగా వారిని 10కి పరిమితం చేయాలని, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధుల సంఖ్యనూ భారీగా కుదించాలని సూచనలందాయి. మండల, జిల్లా, పీసీసీ ఖాళీలను నెలాఖర్లోగా భర్తీ చేయనున్నారు. తరవాత, గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధమవ్వాలని ఏఐసీసీ ఆదేశించింది.
20న ఎస్సీ సదస్సు
20వ తేదీన ఏఐసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో భారీ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, ఎస్సీ సబ్ ప్లాన్, సంక్షేమం తదితరాలపై టీఆర్‌ఎస్ తీరుపై క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఎలా ఉండాలో ఇందులో చర్చించనున్నారు. ఏప్రిల్‌లో మైనారిటీ సదస్సు కూడా నిర్వహించనున్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేయకపోవడంపై పోరాటానికి పీసీసీ సన్నద్ధమవుతోంది.
అధికార ప్రతినిధులకు శిక్షణ
జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలపై పీసీసీ అధికార ప్రతినిధులకు అవగాహన కోసం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. మీడియా సమావేశాలు, సదస్సులు, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల వంటివాటిలో పాల్గొనడానికి ఒక ప్యానెల్‌ను పీసీసీ సిద్ధం చేస్తోంది. ఆ జాబితాను అన్ని మీడియా సంస్థలకూ పంపనుంది. ప్యానెల్‌లోని వారి వ్యాఖ్యలే కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబిస్తాయంటూ వాటికి లేఖలు కూడా రాయనుంది.